29 May, 2026 | 2:46 AM

అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి

29-05-2026 01:05 AM

ముప్పు పొంచి ఉన్నందునే దాడులు: అమెరికా

టెహ్రాన్/వాషింగ్టన్, మే 28: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓ వైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు అమెరికాఛే మధ్య భీకర పోరు నడుస్తోంది. హోర్ముజ్ సమీపంలో అమెరికా దాడులకు ప్రతీకారం గా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా దాడులకు తెగబడుతుండడంతోనే ఆ దేశ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్) వెల్లడించింది. అమెరికా పదేపదే ఒప్పందాన్ని ఉలంఘిస్తోందని, ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. అమెరికా చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే వారి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించింది.

ఇరాన్ దాడులపై అమెరికా స్పందించింది. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాన్ని యూఎస్ దళాలు లక్ష్యం గా చేసుకున్నాయని అమెరికాకు చెందిన ఓ అధికారి వివరించారు. ఈ స్థావరాలతో యూఎస్ బలగాలకు, నౌకలకు ముప్పు పొంచి ఉందన్నారు. అందుకే దాడులు చేశామన్నారు. అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యం గా చేసుకొని ఇరాన్ నాలుగు డ్రోన్‌లను ప్రయోగించిందన్నారు. వీటిని సమర్థవంతంగా అడ్డుకున్నామన్నారు.

టెహ్రాన్ మరిన్ని దాడులకు పాల్పడకముందే తమ దళాలు ఐఆర్జీసీ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. ఇవి ముందుచూపు తో పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని అమెరికా అధికారి సమర్థించుకున్నారు. అమెరికా ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు వద్ద దాడులు చేసింది. మరోవైపు అబ్రహం ఒప్పందాలపై పాకిస్థాన్, ఈజిప్ట్, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా సంతకాలు చేస్తేనే ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు.