calender_icon.png 19 February, 2026 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాన్ దారెటు!

19-02-2026 12:03:19 AM

అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లుగా అనిపిస్తున్నది. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందానికి సంబంధించి రెండు దఫాలు చర్చలు జరిగినప్పటికీ పెద్దగా పురోగతి కనిపించడం లేదు. పైగా చర్చలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషంగా లేరని, ఇజ్రాయెల్‌తో కలిసి మరోసారి ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా సన్నద్ధ మవుతున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ అధికారి అమోస్ యాద్లిన్ చేసిన ట్వీట్ కలకలం రేపింది.

ఈసారి ఇరాన్‌పై జరగనున్న దాడులు కొన్ని నెలల పాటు నిరంతరాయంగా కొనసాగే అవకాశముందన్నారు. ఇక ఒమన్ మధ్యవర్తిత్వంలో జెనీవా వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అణు ఒప్పందానికి సంబంధించి రెండోదఫా చర్చలు బుధవారం ముగిశాయి. ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. అమెరికాతో అణు ఒప్పందానికి వచ్చే విషయమై మాత్రం అబ్బాస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఒకవైపు ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరుపుతూనే మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా భారీగా సైనిక బలాన్ని మోహరించింది. ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలైన గెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్, అబ్రహం లింకన్ యుద్ధ నౌకలను ఇరాన్ సమీపంలో మోహరించిన అమెరికా గత 24 గంటల్లో దాదాపు 50కి పైగా ఫైటర్ జెట్లను ఇరాన్ సమీపానికి తరలించింది. ఇందులో అత్యంత శక్తివంతమైన ఎఫ్ ఎఫ్ ఎఫ్ విమానాలు కూడా ఉన్నాయి.

ఈ చర్యలన్నీ గమనించి చూస్తే ఇరాన్‌తో అణు ఒప్పందం కుదరకపోతే ఏ క్షణంలోనైనా అమెరికా దాడికి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నది. మరోవైపు ఇరాన్ కూడా తామేం తక్కువ తినలేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నది. అణు ఒప్పందమై అమెరికాతో సానుకూలంగా చర్చలు జరుగుతున్నట్లు అబ్బాస్ పేర్కొంటే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మాత్రం యుద్ధ నౌకల మోహరింపుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమెరికా మోహరించిన నౌకలు, ఫైటర్ జెట్లు ప్రమాదకరమైనవే కావొచ్చు, కానీ వాటిని సముద్రంలో ముంచేసే సామర్థ్యమునన్న ఆయుధం మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. ‘అణు చర్చలు జరగాలి కానీ మా వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని’ వాళ్లే చెబుతారు. చర్చల ఫలితాలను ముందుగానే నిర్థారించడం మూర్ఖత్వం కిందకే వస్తుందని పేర్కొన్నారు.

అమెరికా నుంచి సైనిక ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ క్షిపణుల విన్యాసాన్ని కూడా చేపట్టింది. ఇప్పటికే ఇరాన్‌లో అధిక ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రజలపై అణచివేత వైఖరిని మానుకోకపోతే అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.

అయితే తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమెరికా, ఇరాన్‌లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. కయ్యానికి కాలు దువ్వే చర్యలను మానుకొని ఒప్పందాలకు సంబంధించి సామరస్య పూర్వకంగా చర్చలు జరగాల్సిన అవసరముంది.

ఇప్పటికే రెండు దఫాలు చర్చలు ముగియగా, మూడో దఫాలోనైనా అమెరికా, ఇరాన్‌ల మధ్య అణు ఒప్పందం ఒక కొలిక్కి రావాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అప్పుడే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తెరపడే అవకాశముంది.