27 June, 2026 | 5:33 PM

మొగిలిపేట జడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమి పూజ

27-06-2026 04:17 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట జడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణంతో పాటు వంటగది కోసం రేకుల షెడ్డు నిర్మాణ పనులకు శనివారం టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్‌రావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు అందించడం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు ఇలాంటి అభివృద్ధి పనులు దోహదపడతాయని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం పూర్తయితే పారిశుద్ధ్య సమస్యలు తగ్గడంతో పాటు, వంటగది కోసం రేకుల షెడ్డు నిర్మాణం ద్వారా మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.