calender_icon.png 19 February, 2026 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతకు యాప్ కష్టాలు!

19-02-2026 12:07:37 AM

వెంకగారి భూమయ్య :

తెలంగాణలో వ్యవసాయం అనేది ఒక పోరాటంగా మారిపోయింది. వర్షం కోసం ఆకాశం వైపు చూడడం, దానికోసం ఎదురుచూడటం రైతుకు అలవాటే. కానీ ఇప్పుడు ఒక బస్తా యూరియా కోసం చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వైపు దీనంగా చూడాల్సి రావడం రాష్ట్ర సాగు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘట్టంగా చెప్పవచ్చు. పారదర్శకత పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యూరియా బుకింగ్ యాప్’ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అన్నదాతల పాలిట యమపాశం గా మారింది.

పంట తొలి దశలో అత్యంత కీలకమైన యూరియాను పంపిణీ చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలో చిత విధానాలు సాగు రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వరి, మొక్కజొన్న వంటి పంటలు పూత, కోత దశకు చేరుకున్నాయి. కంకి బలంగా రావాలన్నా, గింజ గట్టి పడాలన్నా ఈ సమయంలో నత్రజని (యూరియా) అందించడం తప్పనిసరి. కానీ, రైతులు ఫర్టిలైజర్ షాపుల దగ్గరకు వెళ్తే అధికారులు, డీలర్లు మాత్రం ‘యాప్’ మంత్రం జపిస్తున్నారు.

ప్రభుత్వం యూరి యా పంపిణీని యాప్ పరిధిలోకి తీసుకురావడంతో, అందులో స్టాక్ ఉంటేనే బస్తా ఇవ్వాలనే నిబంధన పెట్టారు. అయితే, దురదృష్టవశాత్తు గత కొద్ది రోజులుగా ఈ యాప్‌ల్లో స్టాక్ నిల్వలు ‘జీరో’ అని చూపిస్తున్నాయి. గోడౌన్లలో బస్తాలు మూలుగుతు న్నా, యాప్‌లో పర్మిషన్ లేదనే సాకుతో రైతులకు ఎరువులు నిరాకరిస్తున్నారు. ఈ జాప్యం వల్ల పంట ఎదుగుదల ఆగిపోయి, దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవగాహన లేమి..

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అన్నదాతలను యూరియా యాప్ కష్టాలు వెం టాడుతున్నాయి. దానిపై అవగాహన లేక యూరియా అందక ఇబ్బంది పడుతున్నా రు. రైతుల్లో చాలా మందికి స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం, మరికొందరికి పట్టాదారు పాస్‌బు క్‌తో మొబైల్ నంబర్ లింక్ చేసుకోకపోవడంతో ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. ఇక వేలాది మంది రైతులకు ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ వాడకం కూడా తెలియదు.

ఇప్పటికీ సాధారణ ఫోన్లు వాడుతూ, కేవలం ఫోన్ కాల్స్‌కే పరిమితమయ్యే అన్నదాతలపై ఈ ‘డిజిటల్ బుకింగ్’ భారం మోపడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం తన అసమర్థ తను దాచుకోవడానికి సాంకేతికతను ఒక సాకుగా వాడుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. ప్రతి రైతు దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉం టుందని భావించడం ప్రభుత్వ అవివేకమే అవుతుంది. ఒకవేళ ఫోన్ ఉన్నా, సర్వర్ డౌన్ సమస్యలు, నెట్‌వర్క్ ఇబ్బందులు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి.

బుకింగ్ కోసం మీ-సేవ కేంద్రాల చుట్టూ, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగలేక రైతు తన సాగు పనులను వదులుకోవాల్సి వస్తోంది. టెక్నాలజీ అనేది సామాన్యుడికి వెసులుబాటు కల్పించాలి కానీ, అతన్ని ఇబ్బందుల పాలు చేసే సంకెళ్లుగా మారకూడదు. వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకొని యాప్‌లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలో తమకు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. 

రైతన్నల ఆగ్రహం..

రైతు ఇప్పటికే విత్తనాలు, దుక్కులు, కూ లీలు, పురుగుల మందుల కోసం వేల రూ పాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం సహజం. పంట చేతికి వచ్చే సమయంలో యూరియా అందకపోతే ఆ పెట్టుబడి అం తా వృధా అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల రైతులు ఎరువుల కోసం అర్ధరాత్రి నుండే  ఎరువుల షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఎండలో గంటల తరబడి నిల్చున్నా, చివరకు యాప్ సమస్య అని చెప్పి ఖాళీ చేతులతో వెనక్కి పంపడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది.

ఇది కేవలం ఒక బస్తా ఎరువు సమస్య కాదు, ఒక కుటుంబం జీవనాధార సమస్య. ప్రభుత్వం ఈ క్లిష్ట పరిస్థితిని గమనించకుండా కేవలం డిజిటల్ లెక్కలకే పరిమితమైతే, అది గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అన్నదాత ఆగ్రహం ఏ ప్రభుత్వానికైనా ప్రమాదకరమే. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎరువుల కోసం రోడ్లపైకి వస్తున్న రైతులను చూస్తుంటే పరిస్థితి చేయి దాటుతోందని అర్థమవుతోంది.

ఓట్ల కోసం పథకాలు ప్రకటించడం కాదు, సాగుకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించడమే అసలైన రైతు పక్షపా తమని వారు గుర్తు చేస్తున్నారు. ఈ అసంతృప్తి ఇలాగే కొనసాగితే, రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రైతు కన్నీటిపై అధికారం నిలబడదని పాలకులు గుర్తించాలి.

యాప్‌ను రద్దు చేయాలి..

ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడాలి. రైతుకు కావాల్సింది ఎరువు, యాప్ లో అంకెలు కాదు. పాత పద్ధతిలోనే ఫర్టిలైజర్ డీలర్ల వద్ద మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ఆజు్పుఐ) ద్వారా ఆధార్ కార్డు ఆధారంగా నేరుగా యూరియా అందేలా చూడాలి. ప్రతి మం డలం మరియు జిల్లా కేంద్రంలో నిల్వలను అందుబాటులో ఉంచాలి. కొరత రాకుండా ముందుగానే అంచనా వేసి సరఫరా పెం చాలి.

ప్రభుత్వ యంత్రాంగం కేవలం పర్యవేక్షణకు పరిమితమై, రైతు సహకార సం ఘాల ద్వారా పంపిణీని వేగవంతం చేయా లి. టెక్నాలజీని రైతు కన్నీళ్లు తుడవడానికి ఉపయోగపడాలి కానీ, కన్నీళ్లు పెట్టించడానికి కాదని ప్రభుత్వం గ్రహించాలి. తెలంగా ణ అన్నదాత ఇప్పుడు ఒక అర్థం కాని చౌరస్తాలో నిలబడి ఉన్నాడు. ఒకవైపు ప్రకృతితో పోరాటం, మరోవైపు ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ సాంకేతిక అడ్డంకులే ఈ చౌరస్తా అని గ్రహించాలి.

మరోవైపు అధికారులు మాత్రం ఎరువుల కోసం యాప్‌లోనే దరఖాస్తు పెట్టుకోవాలని, యాప్‌లో పర్మిషన్ వచ్చిన తర్వాతనే ఎరువు బస్తాలు ఇస్తామని ఆంక్షలు పెడుతున్నారు. దీంతో రైతన్నలు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది. అలా కాదని ఒకవేళ రైతులు నేరుగా ఎరువుల షాపులకు, లేదా రైతు సహకార సంఘాలకు వెళ్తే ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే వెళ్లి ప్రభుత్వాన్ని అడగండి అంటూ సమాధానమిస్తు న్నారు. కాబట్టి తక్షణమే రేవంత్ సర్కార్ స్పందించి ఈ ‘యాప్’ విధానాన్ని రద్దు చేసి, రైతులకు అండగా నిలవాల్సిన అవసరముంది. యూరియా కొరతను తీర్చి సాగు ను రక్షించకపోతే రేపు సామాన్యుడికి మెతుకు కరువయ్యే రోజు వస్తుంది. ఇప్పటికైనా యాప్ విధానాన్ని పక్కన పెట్టి రైతు గుండెల్లో ధైర్యాన్ని నింపేలా ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని యావత్ రైతాంగం డిమాండ్ చేస్తోంది.

 వ్యాసకర్త సెల్: 9848559863