10 March, 2026 | 8:37 AM

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ

10-03-2026 02:35 AM

అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఎంపిక

పెద్ద ఎత్తున ప్రజల మద్దతు 

టెహ్రాన్ వీధుల్లో భారీ ప్రదర్శనలు

మొజ్తబా ఎంపికపై పెదవి విరుస్తున్న ప్రెసిడెంట్ మసౌద్ వర్గీయులు

అంతర్జాతీయ మీడియాలో కథనాలు 

టెహ్రాన్, మార్చి 9: మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా సోమవారం 88 మంది మతపెద్దల కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ కౌన్సిల్ ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక నుంచి దేశ రాజకీయాలు, సైన్యం, న్యాయవ్యవస్థపై తుది నిర్ణయాధికారం ఆయనకే ఉంటుంది. మొజ్తబా ఎంపిక ప్రకటన తర్వాత టెహ్రాన్ వీధుల్లోకి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఆయన ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. 56 ఏళ్ల మొజ్జబా ఖమేనీకి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, భద్రతా వ్యవస్థలపై బలమైన పట్టు ఉంది.

తండ్రి ఖమేనీ పాలన సాగిన సమయంలోనే ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. దేశాధినేత అయిన తండ్రికి జీవితకాలం విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. ఆయనకు దేశానికి నిజమైన కాపలాదారు అనే పేరుండేది. ఖమేనీ ఆరుగురి సంతానంలో ఈయన రెండో కుమారుడు. ఆయనెప్పుడూ క్షేత్రస్థాయి రాజకీయాల్లో నేరుగా పాల్గొనకపోయినా, తెర వెనుక చక్రం తిప్పేవారు.

అధికారిక పదవులు చేపట్టకుండానే ఇరాన్ భద్రతా విభాగాలపై పట్టు సాధించారు. ముఖ్యంగా రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ)తో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. మతపరంగా ఆయనొక హోదా కూడా పొందారు. అయితే, సుప్రీం లీడర్ పదవికి అవసరమైన ‘అయతుల్లా’ స్థాయి ఆయనకు లేదనే చర్చ నడుస్తోంది. దీనిపై ఇరాన్ మత పెద్దల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్‌తోపాటు ఆయన వర్గీయులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

వంశపారంపర్య పాలన, రాచరిక వ్యవస్థ పునరావృతం అవుతున్నదనే ఆ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. గల్ఫ్ దేశాలపై ఇక దాడులు ఉండవని దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించిన, కొద్ది సమయంలోనే ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ మొజ్తబా ఖమేనీని దేశ సుప్రీం లీడర్‌గా ప్రకటించింది. మరోవైపు, గల్ఫ్ దేశాలపై దాడులూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలను బట్టి మసౌద్ వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పెరుగుతున్న మృతుల సంఖ్య

ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడుల వల్ల ఇరాన్‌లో మరణాల సంఖ్య 2,400కి చేరుకున్నట్లు సమాచారం. ఒక్క మినాబ్ పాఠశాలపై జరిగిన దాడిలోనే 170 మంది విద్యార్థినులు మరణించడం గమనార్హం. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు 394 మంది మరణించారు. వీరిలో 83 మంది పిల్లలు. మరోవైపు, ఇజ్రాయెల్‌లోనూ ఇప్పటివరకు 14 మంది పౌరులు మరణించారు. మొత్తంగా యుద్ధం కారణంగా మరణించిన అమెరికన్ సైనికుల సంఖ్య 28కి చేరింది.

ఎక్కువకాలం నిలబడలేరు..

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికైన మొజ్తబా ఖమేనీ ఒక బలహీనమైన నేత. ఆయన నియామకం నాకు ఆమోదయోగ్యం కాదు. ఇరాన్ నాయకత్వ ఎంపికలో అమెరికా ప్రమేయం ఉండాలి. మా ఆమోదం లేని నాయకుడు ఆ పదవిలో ఎక్కువ కాలం నిలబడలేడు. తమకు నచ్చని వ్యక్తిని నియమించుకుంటే, మేం యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అమెరికాకు ఆమోదయోగ్యమైన వ్యక్తినే ఎంపిక చేయాలి. ఇరాన్ అధినాయకత్వంలో ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు. కొత్త సుప్రీం లీడర్‌కు కూడా అదే గతి పడుతుందేమో?

డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు