15 July, 2026 | 2:56 AM

పనికో "రేటు".. అధికారులు, సిబ్బంది రూటే సప"రేటు"

08-06-2024 08:30 PM

జగిత్యాల: జిల్లా కేంద్రమైన జగిత్యాల మున్సిపల్ లోని దాదాపు అన్ని శాఖల్లో ప్రతీ పనికో "రేటు" తీసుకోవడం ఇక్కడ అధికారులు, సిబ్బంది రూటే సప"రేటు"గా తయారై విధులకు హాజరుకాకుండానే ప్రతీ నెల వేతనాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమగ్ర విచారణకు ఆదేశించారు.  అభివృద్ధి పనుల్లో కమిషన్లను దండుకుంటూ నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో పాటు చేయని పనులకు ముందే చెక్కులిచ్చినట్లు తెలిసింది. జిల్లాలోని దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో పాలి"ట్రిక్స్"తో అవినీతికి అంతేలేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజా సేవకు పునరంకితమై పని చేయాల్సిన పాలకులు చేతికి మట్టిని అంటించు కోకుండా అందినకాడికి దండుకునే పడ్డారని జనం చర్చించుకుంటున్నారు. 

గత కొన్నేళ్లుగా పాలక వర్గంలో ఉన్న కొందరు కీలక నేతలకు మున్సిపాలిటీలు కల్ప తరువుగా మారాయి. మున్సిపాటీల్లో మూడు కీలక సెక్షన్లలోని కొందరు అధికారులు నెల వారి మామూళ్లు ఇవ్వాలని పాలక వర్గంలో కీలక నేతలు వసూళ్ల కు పాల్పడుతున్నారనే కొందరు చర్చించుకుంటున్నారు. ఆ వేధింపులు భరించలేక కొందరు అధికారులు బదిలీ పై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఇక్కడి మున్సిపాలిటీల్లోకి రావాలంటే మరి కొందరు అధికారులు జంకుతున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీల పరిధిలో ఇంటి, జాతీయ రహదారి వెంట వ్యాపార, వాణిజ్య షాపింగ్ కాంప్లెక్స్  నిర్మాణాలు చేపట్టేందుకు జనం జంకుతున్నారు. ఏ నిర్మాణాలు చేపట్టాలన్నా మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవడానికి ముందే ఆయా వార్డుల కౌన్సిలర్ల  నుండి కీలక నాయకుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందనేది బహిరంగ రహస్యమే.

ఏ నిర్మాణాలు చేపట్టాలన్నా ముందస్తు లెక్కలు వేసుకొని భయంతో హడలిపోతున్నారు. స్థానిక వార్డు కౌన్సిలర్ల అనుమతి లేకుండా వారి వార్డుల్లో పునాదులు తవ్వినా, ఇసుక, పునాది రాయి, ఇటుక సామాగ్రి కనిపిస్తే చాలు ఆ ఇల్లు ఎవరిదీ? మున్సిపాలిటీ అనుమతి తీసుకున్నారా? ఎవరి అడిగి అనుమతి ఇచ్చారు? వార్డు కౌన్సిలర్ ను అడగాల్సిన అవసరం లేదా? తట్టాలు, పారాలు, పనిముట్లు తీసుకురావాలని కొందరు వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులకు హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇవ్వకపోతే రూల్ ప్రకారం నిర్మాణాల కోసం ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకున్నా కొర్రీలు పెట్టి అనుమతి రద్దుచేసే వరకు వదిలిపెట్టడం లేదనే  ఆరోపణలు ఉన్నాయి. ఇలా అధిక మొత్తంలో అందినకాడికి దండుకొని తిరిగి నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం. అడిగినంత ఇవ్వకపోతే నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయలేమని అధికారులు తెగేసి చెబుతున్నారని తెలిసింది. మీరు ఇంటిని నిర్మించుకునేందుకు మున్సిపల్ అనుమతికి ముందు మీ వార్డుల్లోని కౌన్సిలర్ల అనుమతులు తప్పక తీసుకోవాలసిందే అని మున్సిపల్ సిబ్బంది, అధికారులు, నాయకుల పేర్లు చెప్పి వారి వద్దకు పంపిస్తున్నట్లు తెలిసింది.

అడిగింత ఇచ్చి ఎలాగోలా అనుమతులు తీసుకున్నా క్షేత్రస్థాయిలో మరికొందరు ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. తమ వాట ఇవ్వకుంటే ఫిర్యాదులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. నాయకుల,అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో అడిగింది ఇచ్చి కామ్ గానే పని చేసుకుంటున్నారు.జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీల్లోని రెవెన్యూ, సానిటేషన్ సెక్షన్ల లోనూ అనేక అక్రమాలు జరుగుతున్నాయినే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మ్యూటేషన్లు, సెల్ఫ్ అసెస్ మెంట్ లో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ రెవెన్యూ అధికారిని సరెండర్ చేయాలని కొందరు కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఆపేందుకు అధికమొత్తం ఆఫర్ చేసినట్లు తెలిసింది. సానిటేషన్ విభాగంలో డిజిల్, రిపేర్ల పేర అక్రమాలు, సిబ్బంది హాజరులో అవకతవలు  జరినట్లు సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విచారణకు అదేశించినట్లు తెలిసింది. పాలకుల జోక్యం,అధికార పార్టీ నాయకులకు ఏదో రకంగా కొంత దక్షిణ ముట్ట చెపుతుండడంతో ఆపద సమయంలో అండగా నిలుస్తూ గండం నుండి గట్టెక్కిస్తారనే అపారమైన నమ్మకంతో ఇక్కడి అధికారులు ఉండడం  గమనార్హం.