ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఇఎల్వి భాస్కర్
• 30 లక్షలతో నాలుగు గదుల పాఠశాల భవనం ప్రారంభం
• ప్రభుత్వ బడుల బలోపేతానికి వెనుకాడేది లేదని స్పష్టీకరణ
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండలం అల్లందేవిచెరువు గ్రామంలో 30 లక్షల వ్యయంతో నాలుగు గదుల ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఇఎల్వి ఫౌండేషన్ అధినేత ఇరుగుదిండ్ల భాస్కర్ నిర్మించి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని వారి సారథ్యంలో పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతానని అన్నారు.
ముప్పై లక్షల వ్యయంతో 200 మంది చదువుకునేలా పాఠశాల భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరారు.సర్పంచ్ సుర్వి సౌజన్యరాజుగౌడ్ మాట్లాడుతూ అడిగిన వెంటనే పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల భవనాన్ని నిర్మించి ఇచ్చిన భాస్కర్ కు గ్రామస్తుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. మండల విద్యాధికారి,పాఠశాల ఉపాధ్యాయ బృందం,గ్రామస్తులు,పాలకవర్గ సభ్యులు, ఇఎల్వి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.






