4 July, 2026 | 5:47 PM

షెడ్యూల్ ప్రాంత హక్కుల రక్షణకై పోరాటం

04-07-2026 04:33 PM

* 1/70 కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేయాలి

 * పూసం సచిన్

 టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఉట్నూర్,(విజయక్రాంతి): షెడ్యూల్ ప్రాంత హక్కులకై వాటి పరిరక్షణకై ఆదివాసీల తో కలిసి విశాల పోరాట వేదిక నిర్మిస్తామని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు.  శనివారం ఇంద్రవెల్లి మండలంలోని పిప్రి గ్రామపంచాయతీలో వైజ్ఞానిక సైనికుడు ఆదివాసి ఉద్యమకారుడు టీఏజిఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ మెస్రం మనోహర్ 4వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు.

 ఈ సందర్భంగా  ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడుతూ... కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంత హక్కులని నిర్వీర్యం చేసేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 5 6 షెడ్యూల్ ప్రాంతాలను కాపాడేందుకు షెడ్యూల్ ప్రాంత చట్టాలను రక్షించేందుకు విశాల పోరాట వేదిక అవసరమని దానికోసం ఆదివాసీలను ఆదివాసి సంఘాలను కలుపుకొని పోరాటాల నిర్మిస్తామని తెలిపారు.

1/70  యాక్టును  కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రిప్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 100% గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగాలలో అవకాశం కల్పించే జీవో నంబర్ మూడును పునరుద్ధరించాలని  డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ ఏజెన్సీ డిఎస్సి వేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని ఐటిడీఏలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం 300 కోట్లు కేటాయించి అన్ని శాఖలను పనిలో పెట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అడ్డువస్తున్న ఫారెస్ట్ శాఖ అడ్డంకులను తొలగించాలని అన్ని రకాల పథకాలను ఆదివాసీలకు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ఇందిరా ప్రభ జిల్లా పథకం నేటికీ గిరిజన గుడాల్లో ప్రారంభం కాలేదని, వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్ మెస్రం మనోహర్ ఆదివాసీల సమాజ అభివృద్ధికి ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం వారిలోని మూడ విశ్వాసాలను తొలగించేందుకు తీవ్రమైన కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించేందుకు నేటి యువత ముందుకు రావాలని హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.