4 July, 2026 | 6:43 PM

మాంగ్ కుల ధృవీకరణకు ఉత్తర్వులు.. సంఘం ఆనందం

04-07-2026 05:02 PM

జైనూర్,(విజయ క్రాంతి): మాంగ్ కులానికి తహశీల్దార్ ద్వారా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మాంగ్ సమాజ్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం జైనూర్‌లో మాంగ్ సమాజ్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మోహాలే దత్త మాంగ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మోహాలే దత్త మాంగ్ మాట్లాడుతూ... గతంలో RDO కార్యాలయం ద్వారా కుల ధృవీకరణ పత్రాలు సకాలంలో రాకపోవడంతో మాంగ్ సమాజ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇతర కులాల పేరుతో పత్రాలు తీసుకోవాల్సి వచ్చి మాంగ్ కుల ఉనికే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ చేసిన విజ్ఞప్తికి స్పందించి, మాంగ్ కుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తహశీల్దార్‌కు ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఇకపై మాంగ్ కులం పేరుతోనే పత్రాలు జారీ అయ్యేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారని గుర్తు చేశారు.