4 July, 2026 | 6:40 PM

ఆదరణ వృద్ధాశ్రమంలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం

04-07-2026 04:55 PM

చిట్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో నార్కట్‌పల్లిలోని ఆదరణ వృద్ధాశ్రమంలో శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ ట్రెజరర్ పంతంగి కరుణాకర్ గౌడ్ కుమారుడు అఖిలేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధులకు బియ్యం, కిరాణా సామగ్రి తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నరసింహ గౌడ్ మాట్లాడుతూ.... లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ మానవ సేవకు ప్రాధాన్యత ఇస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

చార్టర్ ప్రెసిడెంట్ జనగాం రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వృద్ధులను గౌరవించి వారి అవసరాలను తీర్చేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ట్రెజరర్ పంతంగి కరుణాకర్ గౌడ్ మాట్లాడుతూ, తన కుమారుడి జన్మదినాన్ని సమాజ సేవతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు కృష్ణ లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పొన్నం లక్ష్మయ్య గౌడ్, దంతూరి సైదులు గౌడ్, బెల్డ సత్యనారాయణ, రంగా వెంకటేశ్వర్లు, బాలాగోని రాజు గౌడ్, పల్ల వెంకటేశ్వర్లు, పబ్బతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సభ్యులు వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.