4 July, 2026 | 5:47 PM

భారీ గంజాయి పట్టివేత

04-07-2026 04:26 PM

- 166 కిలోల గంజాయి స్వాదీనం 

- ప్రధాన నిందితుడు అరెస్ట్

- రూ.89.13 లక్షల విలువైన గంజాయి, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం 

- సత్తుపల్లి పోలీసుల సక్సెస్.

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి ఆధ్వర్యంలో ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఈగల్ టీమ్, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 166 కిలోల 360 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.89.13 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.

ఈ కేసులో ప్రబీన్ బాత్రా అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక టయోటా ఎటియోస్ కారు, ఒక సెల్‌ఫోన్, రూ.500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులను కేసులో చేర్చి వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా, సత్తుపల్లి పట్టణంలోని ఒక హోటల్ సమీపంలో వాహనాల తనిఖీల సందర్భంగా నిందితుడు పోలీసులకు చిక్కాడు.

స్వాధీనం చేసుకున్న గంజాయిని 80 ప్యాకెట్లలో తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై క్రైం నెం. 290/2026గా ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. విచారణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.