25 August, 2026 | 9:32 PM

మరో మండల్ ఉద్యమం తప్పదా!

25-08-2026 12:00 AM

భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, వెనుకబడిన వర్గాల సాధికారత గురించి మాట్లాడినప్పుడు బి.పి. మండల్ పేరు అత్యంత గౌరవంతో గుర్తుకు వస్తుంది. బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు; భారత సమాజంలోని అసమానతలను అధ్యయనం చేసి, వెనుకబడిన తరగతులకు రాజ్యాంగబద్ధమైన అవకాశాలు కల్పించేందుకు శాస్త్రీయ మార్గాన్ని చూపిన నాయకుడు. ఆయన అధ్యక్షతన ఏర్పడిన రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్, ప్రజల్లో ప్రసిద్ధి చెందిన మండల్ కమిషన్, భారత సామాజిక న్యాయ 

చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

బిందేశ్వరి ప్రసాద్ మండల్ 1918 ఆగస్టు 25న బీహార్‌లో జన్మించా రు. ప్రజా జీవితంలోకి ప్రవేశించి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఆయన 1968లో బీహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయనకు చరిత్రలో శాశ్వత స్థానం కల్పించింది వెనుకబడిన తరగతుల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై చేసిన కృషి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల పరిస్థితిని అధ్యయనం చేసి, వారి అభ్యున్నతికి చర్యలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం 1979లో రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి బి.పి. మండల్ అధ్యక్షత వహించారు. విస్తృతమైన అధ్యయనం, సర్వేలు, గణాంకాల సేకరణ అనంతరం కమిషన్ 1980 డిసెంబర్ 31న నివేదికను సమర్పించింది.

మండల్ కమిషన్ ప్రత్యేకత

మండల్ కమిషన్ గొప్పతనం కేవలం 27 శాతం రిజర్వేషన్ సిఫారసు చేయడంలో లేదు. వెనుకబడిన తరగతి అంటే ఎవరు? అనే ప్రశ్నకు శాస్త్రీయ సమాధానం ఇవ్వడమే దాని ప్రత్యేకత. కమిషన్ సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులను పరిశీలించేందుకు 11 సూచికలను ఈ కమిషన్ రూపొందించింది. వాటిని నాలుగు సామాజిక, మూడు విద్యా, నాలుగు ఆర్థిక సూచికలుగా విభజించింది. సామాజిక సూచికలకు ఎక్కువ వెయిటేజీ, విద్యా సూచికలకు తదుపరి ప్రాధాన్యత, ఆర్థిక సూచికలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి మొత్తం 22 పాయింట్ల విధానాన్ని రూపొందించింది. 11 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించిన కులాలు/తరగతులను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినవిగా గుర్తించింది. దీంతో వెనుకబాటుతనాన్ని కేవలం రాజకీయ ప్రకటనగా కాకుండా సామాజిక స్థితి, విద్యా పరిస్థితి, ఆర్థిక అంశాల ఆధారంగా అంచనా వేసే ప్రయత్నం జరిగింది. ఈ విధానాన్ని తర్వాత కాలంలో న్యాయస్థానాలు కూడా సమర్థించాయి. అంటే అంత శాస్త్రీయంగా ఆయన వెనుకబడిన కులాలుగా 3,743 కులాలను గుర్తించారు. మండల్ కమిషన్ మొత్తం 40 సిఫారసులు చేసింది.

పూర్తిగా అమలైనవి: 27% కేంద్ర ఉద్యోగ రిజర్వేషన్, కేంద్ర విద్యాసంస్థల్లో రిజర్వేషన్, ఓపెన్ మెరిట్ అడ్జస్ట్‌మెంట్, వయో పరిమితి సడలింపు, రోస్టర్, ప్రత్యేక శిక్షణ వంటి అంశాలు.

పాక్షికంగా అమలైనవి: విద్యా సౌకర్యాలు, హాస్టళ్లు, వృత్తివిద్యా శిక్షణ, ఆర్థిక సహాయం, హస్తకళాకారులు/ఎంటర్‌ప్రెన్యూర్లకు రుణాలు, ఓబీసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు, ప్రభుత్వ/పీఎస్‌యూ రంగంలో ప్రాతినిధ్యం మొదలైనవి. ఇప్పటికీ అమలు కానివి: ప్రైవేట్ రంగంలో, పదోన్నతుల్లో ఓబీసీ రిజర్వేషన్, సమగ్ర భూసంస్కరణలు, భూమిలేని ఓబీసీకు భూపంపిణీ, విస్తృత ఆర్థిక- సామాజిక నిర్మాణాత్మక మార్పిడి.

27% రిజర్వేషన్ ఓ కొత్త దిశ

మండల్ కమిషన్ 1931 జనగణన ప్రకారం దేశ జనాభాలో ఓబీసీలు సుమారు 52 శాతం ఉన్నారని అంచనా వేసింది. బాలాజీ వర్సెస్ స్టేట్ అఫ్ మైసూర్ 1961, ఆతర్వాత కాలంలోని సుప్రీంకోర్ట్ తీర్పులను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు 50% సీలింగ్  లోబడి ఉండాలనే నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను 1980లో సిఫారసు చేసింది. అప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. 1990లో కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసును అమలు చేయాలని నిర్ణయించింది. అనంతరం ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించింది. 1993 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలులోకి వచ్చింది. విద్యలో 2008లో వచ్చింది. ఇది భారతదేశంలో సామాజిక న్యాయ రాజకీయాలకు ఒక కొత్త దశను ప్రారంభించింది.

మండల్ నాయక్ చర్చ

మండల్ కమిషన్ సభ్యుడు నాయక్   అభిప్రాయం ప్రకారం ఓబీసీలు ఒకే స్థాయిలో వెనుకబడిన సమూహం కాదు. కొంతమంది ఓబీసీ వర్గాలు సాపేక్షంగా ముందుకు వచ్చినప్పటికీ, మరికొన్ని వర్గాలు తీవ్రమైన సామాజిక, విద్యా, ఆర్థిక వెనుకబాటుతనంలో ఉన్నాయి. అందువల్ల ఓబీసీను రెండు వర్గాలుగా ఇంటర్మీడియట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్,  డిప్రెస్‌డ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌గా విభజించి, అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని ఆయన సూచించారు.

బి.పి. మండల్ నాయక్ తన ఫార్వడింగ్ లెటర్‌లో నాయక్ వాదనలో అంశం ఉందని కమిషన్ గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే అప్పటి న్యాయపరమైన పరిస్థితులు, ముఖ్యంగా ఎంఆర్.బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మౌసూర్ తీర్పు నేపథ్యంలో ఓబీసీలను ఉపవర్గీకరించడం సాధ్యమా? అనే విషయంలో కమిషన్ జాగ్రత్తగా వ్యవహరించింది. తరువాత ఇందిరా సాహ్నీ తీర్పుతో ఓబీసీలలో సాపేక్ష వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఓబీసీలను అత్యంత వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన వర్గాలుగా విభజించే అవకాశం ఏర్పడింది. 

వెనుకబాటుతనమే ప్రమాణం

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, మండల్ కమిషన్ ఓబీసీ గుర్తింపును కేవలం హిందూ సమాజానికి పరిమితం చేయలేదు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన నాన్ సమూహాలను కూడా పరిశీలించింది. అంటరాని కులాల నుంచి ఇతర మతాల్లోకి మారిన వర్గాలు, అలాగే హిందూ ఓబీసీలకు సమానమైన సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన సమూహాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ధోబీ, తేలీ, నాయీ, కుమ్హార్, లోహార్, దర్జీ వంటి వృత్తి సమూహాలు ఇందుకు ఉదాహరణలు. దీని ద్వారా ఒక ముఖ్యమైన సూత్రం స్పష్టమవుతుంది: వెనుకబాటుతనాన్ని మతం ఆధారంగా కాకుండా సామాజిక స్థితి, విద్యా వెనుకబాటుతనం, వృత్తి, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా గుర్తించాలి.

ఇంకా పూర్తి కాలేదు

మండల్ కమిషన్ చేసిన 40 సిఫారసులలో కొన్ని అమలయ్యాయి; మరికొన్ని పాక్షికంగా అమలయ్యాయి; అనేక అంశాలు ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయి. అందువల్ల నేడు మండల్ సిఫారసులను సాధించాలంటే 27 శాతం రిజర్వేషన్‌ను కాపాడటమే కాదు; ఆ రిజర్వేషన్ ప్రయోజనాలు బీసీలలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు కూడా సముచితంగా చేరేలా చేయాలి.

ఒకవైపు జయంతి మరోవైపు రిజర్వేషన్ హటావో: మండల్ కమిషన్ సిఫారసుల ఆధారంగా 27% రిజర్వేషన్లు ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం గత 33 ఏళ్లుగా అమలు పరుస్తున్నప్పటికీ, నేటికీ కేంద్ర ప్రభుత్వ ఏ, బీ కేటగిరి  ఉద్యోగాలలో 22% దాటకపోవడం శోచనీయం. పరిస్థితి ఇలా ఉంటే ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ  వ్యవస్థ, సామాజిక న్యాయంపై అవగాహన లేని కొంతమంది జెన్ జీ   యువత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

1. సమ్మిళిత అభివృద్ధి: సమాజంలో అత్యధిక జనాభా ఉన్న వర్గాలు అభివృద్ధికి దూరంగా ఉంటే, ‘సబ్ కా సాత్ -సబ్ కా వికాస్’ అనేది సాధ్యం కాదు. 

2. కులవివక్షత, సామాజిక, విద్య అసమానతలు: ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు ఇస్తే, శతాబ్దాలుగా వస్తున్న సామాజిక వివక్ష, ప్రాతినిధ్య లోపం నెరవేరవు. 

3. జనాభా దామాషా ప్రాతినిధ్యం: ఉద్యోగాలు, విద్య, రాజకీయాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా అవకాశాలు కల్పించినప్పుడే దేశంలో సమగ్ర సామాజిక సమతుల్యత సాధించబడుతుంది. రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయాన్ని కాపాడుకుంటూ, బీసీలలోని అత్యంత వెనుకబడిన కులాలకు (ఈబీసీ/ఎంబీసీలు) కూడా ఈ ఫలాలు అందేలా వర్గీకరణ, పారదర్శక విధానాలు అమలు చేయడం అత్యంత ఆవశ్యకం.

పేదరిక నిర్మూలన పథకాలు కావు: పేదరికం ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు వేరు; రిజర్వేషన్లు వేరు. రాజ్యాంగంలోని రిజర్వేషన్ వ్యవస్థకు ప్రధాన ప్రాతిపదిక చారిత్రకంగా కొనసాగిన సామాజిక వెనుకబాటుతనం, వివక్ష, ప్రభుత్వ వ్యవస్థల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం. రిజర్వేషన్ల ద్వారా ఇప్పటివరకు అట్టడుగుకు నెట్టబడిన సామాజిక వర్గాలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజాప్రతినిధ్య సంస్థల్లో కొంతమేరకు ప్రవేశం లభించింది. ఈ వ్యవస్థను తొలగిస్తే, ఫలితంగా ఇప్పటికే సాధించిన కొద్దిపాటి ప్రాతినిధ్యం కూడా క్రమంగా కోల్పోయి, ఈ వర్గాలు మళ్లీ పాత సామాజిక స్థితికే వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది.

అందువల్ల రిజర్వేషన్లు ఎప్పుడు తొలగించాలి? అనే ప్రశ్నకు కేవలం ఆర్థిక పరిస్థితిని ప్రమాణంగా పెట్టడం సరిపోదు. సామాజిక వివక్ష, విద్యా వెనుకబాటుతనం, ప్రభుత్వ సేవల్లో ప్రాతినిధ్యం, అవకాశాల సమానత్వం వంటి రాజ్యాంగ లక్ష్యాలు వాస్తవంగా సాధించారా, లేదా? అనేదే ప్రధానంగా చూడాలి. అయితే, ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు ఇందిరా సహానీ కేసు (1992)లో తీర్పు చెప్పినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన ఆధిపత్య కులాలకు 103వ రాజ్యాంగ సవరణ చేసి పూర్తిగా 10% రిజర్వేషన్లు 2019 నుంచి అమలు చేస్తున్నారు. మరోవైపు బహుజనుల రిజర్వేషన్లు తీసివేయాలని ఉద్యమాలు మొదలుపెట్టారు. అందుకే బహుజనులు  ఏకమై ‘రిజర్వేషన్ బచావో’ ఆందోళన  చేయాలిసిన అవసరం ఏర్పడింది. లేన్నట్లయితే అంబేద్కర్ వంటి రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన  సామాజిక న్యాయాన్ని ఆధిపత్య కులాలు సమాధి చేయగలవు. తస్మాత్ జాగ్రత్త!

మండల్ జయంతిని కేవలం జయంతి కార్యక్రమంగా కాకుండా సామాజిక న్యాయానికి పునఃసంకల్ప దినంగా జరుపుకోవాలి. మొదటగా సమగ్ర కులగణన అవసరం. జనాభాలో ఎవరి సంఖ్య ఎంత? విద్య, ఉద్యోగం, భూమి, ఆస్తి, ఆదాయం, పరిపాలన, రాజకీయాల్లో ఎవరి ప్రాతినిధ్యం ఎంత? అనే ప్రశ్నలకు కచ్చితమైన గణాంకాలు కావాలి. కానీ, కేంద్రం 2027 జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కులానికొక ప్రత్యేక కోడ్ నెంబర్ ఇవ్వకుండా, ఓపెన్ కేటగిరీ కులాలతో కలిపి బీసీలకు మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నది. బీసీలు తీవ్రంగా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైనది. రెండవది విద్యలో సమాన అవకాశాలు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య, సాంకేతిక విద్య, పరిశోధన, విదేశీ విద్య వరకు బీసీ విద్యార్థులకు అవకాశాలు విస్తరించాలి. పీహెచ్‌డీ, ఇతర ఉన్నత విద్య ఉపకార వేతనాలు పెంచాలి. మూడవది ఉపాధి, ఆర్థిక సాధికారత.

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌తోపాటు వ్యాపారం, పరిశ్రమ, స్వయం ఉపాధి, రుణాలు, మార్కెట్ అవకాశాల్లో బీసీలకు బలమైన విధానాలు అవసరం. బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు పెంచాలి. ఉప ప్రణాళికలు తీసుకురావాలి. నాలుగవది రాజకీయ ప్రాతినిధ్యం. జనాభాలో పెద్ద భాగంగా ఉన్న బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు కూడా 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించాలి. ఐదవది బీసీలలో అంతర్గత న్యాయం. మండల్ నాయక్ చర్చ మనకు గుర్తుచేసేది ఇదే. బీసీల ఐక్యతను కాపాడుతూనే అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా న్యాయం జరిగే విధానాన్ని రూపొందించాలి.

ఇక్కడే 2017లో ఏర్పాటు చేసిన రోహిణి కమిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓబీసీలలో రిజర్వేషన్ ప్రయోజనాలు సమానంగా చేరుతున్నాయా, అవసరమైతే ఉపవర్గీకరణ ఎలా చేయాలి అనే అంశాలను పరిశీలించిన ఈ కమిషన్ 2023 జూలై 31న తన నివేదికను సమర్పించింది. అయితే 2026 నాటికీ ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడం సామాజిక న్యాయ ఉద్యమం ముందున్న కీలక ప్రశ్నగా మిగిలింది. రోహిణి కమిషన్ రిపోర్ట్ తక్షణమే అమలు చేయాలి.

బి.పి. మండల్ మనకు ఇచ్చిన గొప్ప సందేశం ఏమిటంటే సామాజిక న్యాయం దానం కాదు; అది హక్కు. ప్రాతినిధ్యం ఉపకారం కాదు; అది ప్రజాస్వామ్య హక్కు. మండల్ స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి. మరో మండల్ ఉద్యమాన్ని నిర్మిద్దాం. అప్పుడే హిస్స (వాటా), ఇజ్టత్ (ఆత్మగౌరవం), హుకుమత్ (అధికారం) సాధ్యమవుతాయి.

కాబట్టి మండల్ ఆశయ సాధనను పూర్తి చేయాలంటే కులగణన, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక గౌరవం మాత్రమే కాదు; బీసీలలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయమైన వాటా కూడా కల్పించాలి. అన్ని రంగాల్లో సమానత్వాన్ని సాధించడమే బి.పి. మండల్‌కు మనమిచ్చే నిజమైన నివాళి.

మండల్ ఆశయ సాధనను పూర్తి చేయాలంటే కులగణన, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక గౌరవం మాత్రమే కాదు; బీసీలలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయమైన వాటా కూడా కల్పించాలి. అన్ని రంగాల్లో సమానత్వాన్ని సాధించడమే మండల్‌కు మనమిచ్చే నివాళి.

 వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, 

బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్

టి.చిరంజీవులు