బలహీనులపైనే సర్కార్ బలప్రయోగం
ప్రాంతీయ పార్టీలలో నియంతృత్వం, అణచివేత ధోరణి గతంలో ఉన్నాయి, భవిష్యత్తులోనూ ఉంటాయి. ఇకపోతే జాతీయ రాజకీయ పార్టీలలో కేంద్రంలో అధికారంలో ఉంటే ఒక తీరు, అధికారంలో లేకుంటే మరొక తరీఖ ఉంటుంది. పైకి ఎక్కువ భావప్రకటనా స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నట్టు కనబడుతుంది. కానీ, ఇది నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉంటుంది. పీసీసీ గాని, పరోక్షంగా ముఖ్యమంత్రి గాని వెనుకబడిన వర్గాల మంత్రుల విషయంలో చిన్న అవకాశం దొరికితే చాలు ఒంటికాలు మీద లేస్తారు.
అదే రాజకీయ పార్టీలోని అగ్రవర్ణ నాయకుల పట్ల చిటికెన వేలు కూడా చూపించ సాహసించ లేరు. ఇది చర్విత చరణంగా ఆయా ప్రాంతీయ, జాతీయ రాజకీయ నాయకుల చరిత్ర నమోదు చేసిన సత్యాలు. 2025 ఫిబ్రవరిలో సంచలనం కలిగించిన ఖమ్మం వెలుగుమట్లలో బుల్డోజర్లతో గృహాల విధ్వంసానికి కారకులైన వారిపై చర్యలు తీసుకున్నారా? కనీసం దిద్దుబాటు చర్యలైనా తీసుకున్నారా? లేదు కదా. ఇక్కడే బలవంతులైన నాయకులకు, బలహీనవర్గానికి చెందిన నాయకులకు మధ్య తేడా కనిపిస్తున్నది. ఇది ముఖ్యమంత్రి వర్గానికి కనిపించదు, పీసీసీకి వినిపించదు.
తెలంగాణ మేధావులంతా వ్యతిరేకించినా, 2025 డిసెంబర్‌లో రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించడం వలన తెలంగాణ సాంస్కృతిక రంగంలో ఈ ప్రభుత్వం ఒక అపవాదును మూటగట్టుకున్నది. ఇదిలా ఉండగానే పుండు మీద కారం చల్లినట్టు 2026 మే నెలలో మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మరో వివాదానికి దారితీసింది. గత పాలకులు ఓట్లు, సీట్లే ప్రధానంగా పనిచేసినట్టే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు మినహాయింపు ఏ మాత్రం కాదు. పైగా తెలంగాణ ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వం విషయంలో అలసత్వాన్ని, సాచివేత ధోరణిని ప్రదర్శిస్తున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
గత పాలకుల తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే, వీళ్లు వాళ్లని మించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత పాలకుల హయాంలో అవినీతి, అక్రమాలు కేంద్రీకృతమైతే, ప్రస్తుత పాలకుల కాలంలో వికేంద్రీకరణ జరిగిందని అప్పటికీ, ఇప్పటికీ ఉన్న భేదం గురించి రాజకీయ విశ్లేషకులు బాహటంగానే చెప్పుకొంటున్నారు. పైగా మూడేళ్లు పూర్తిచేసుకున్న ప్రజాపాలనలో 22ఏ భూమి సమస్యలు మరింత జటిలంగా తయారయ్యాయి. ఇక్కడే బలహీనవర్గానికి చెందిన మంత్రులకు బలవంతులైన మంత్రులకు మధ్య స్పష్టమైన భేదం అఘాతంలో కనిపిస్తుంది. ఒకవేళ రెవెన్యూ శాఖ మంత్రి స్థానంలో బలహీనవర్గానికి చెందిన మంత్రి ఉంటే ఈపాటికి ఇంటికి పంపించేవారు. అన్ని రకాల క్రమశిక్షణ చర్యలు గుర్తుకు వచ్చేవి.
అంతేకాకుండా గత పాలకులు కాలంలోని అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపి విచారణ నివేదికలను క్యాబినెట్ ఆమోదించిన తర్వాత కూడా తీసుకున్న చర్యలు శూన్యం. దీంతో రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనే ప్రచారం కోడై కూస్తున్నది. గత నాయకుడి లాగానే ప్రస్తుత ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి గానీ సుతరాము చేతలు గడప దాటడం లేదు. కేవలం ప్రతిపక్ష పార్టీపై దాడి వలన ఇక ముందు ఎల్లకాలం చెల్లదు గాకా చెల్లనేరదు. తెలంగాణ ప్రజలు అవకాశం కోసం చూసే జాగరూక సమాజం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే బలహీనులకు ఒక తరిఖ, బలవంతులకు ఒక తీరు పని చేస్తూ పోతే ప్రభుత్వ వ్యతిరేకతను మరో జాతీయ పార్టీ ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కనరలేదు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలకు, సీఎం అయిన తర్వాత చేస్తున్న చేతలకు మధ్య తిలకాష్ట మహిశ బంధనం వలె ప్రజలకు, పాలకులకు మధ్య; బలవంతులకు, బలహీనులకు మధ్య వివక్ష, దూరం పెరుగుతున్నది.
కాంగ్రెస్ గ్రాఫ్ ప్రజలలో క్రమక్రమంగా పడిపోతున్నది. పది సంవత్సరాలు కాలంలో ప్రతిదాన్ని 60 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై తోసివేసినట్టే పిడుగుకూ, బియ్యానికి కాంగ్రెస్ పార్టీ కూడా గత పది వత్సరాల పాలనపై నెట్టేయడం సరైందేమీ కాదు. ఇకముందు ఎక్కువ కాలం ఈ వాదన చెల్లదు. ఈ పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వానికి 2028లో జరిగే ఎన్నికలలో ముప్పుగా పరిణామం చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వ్యాసకర్త: ప్రముఖ కవి, రచయిత
జూకంటి జగన్నాథం






