09-01-2026 12:00:00 AM
పేదలకు, పరిమితమైన వనరులు కలిగిన వ్యక్తులకు ఉచిత న్యాయసేవలు అందించడం రాజ్యాంగ ప్రాథమిక కర్తవ్యం. పేదరికం, ఇతరత్రా కారణాలేవైనా తమ తరఫున వాదించేందుకు న్యాయవాదిని నియమించుకోలేని నిందితుడికి ప్రభుత్వం ఖర్చుతో కూడిన న్యాయ సాయం అందేలా చూడాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు అనగానే నిరక్షరాస్యులకే కాదు అక్షరాస్యులకూ భయమే. కానీ అది మనం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ అని, అక్కడ ఉచిత న్యాయం పొందడం మన హక్కు అని తెలిసిన వారి సంఖ్య తక్కువే. అయితే ప్రభు త్వం కూడా ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. జాతీయ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ (నల్సా), రాష్ర్ట లీగల్ సర్వీసెస్ ఆథారిటీ (టీజీఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్ర మాలు చేపడుతున్నా ఆర్థిక లోటు, వసతుల లేమి కారణంగా అవి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం లేదు.
భారతదేశంలో భారీ వ్యయప్రయాసాలతో కూడిన న్యాయవ్యవస్థ సంక్లిష్ట వ్యవహారంగా మారడంతో సామాన్యులకు న్యాయం అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. భారతదేశంలోని జైళ్లలో మొత్తం ఖైదీల్లో 75 శాతం మంది విచారణ ఖైదీలుండగా.. వీరిలో చాలా మంది నేరం చేశారా లేదా అన్నది తెలియదు. పేదరికం కారణంగా బెయిల్‌కు దూరమవుతూ.. దురదృష్టవశాత్తు బెయిల్ లభించినా పూచీకత్తు సమర్పణకు సొమ్ము లేక జైళ్లలోనే మగ్గుతున్నారు. ఇలాంటి వారిలో 8 శాతం మందికి మాత్రమే న్యాయ సహాయం లభిస్తుండగా, క్రిమినల్ కేసుల్లో అరెస్టు అయిన వారిలో కేవలం ఒక శాతం మందికి మాత్రమే న్యాయ సహాయం లభిస్తుంది.
కోట్లలో పెండింగ్ కేసులు..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకా ల ప్రకారం 2022 డిసెంబర్ 31 నాటికి దేశంలోని జైళ్లలో 5,73,220 మంది ఖైదీలుండగా, వీరిలో 4,34,302 మంది విచారణ ఖైదీలే ఉన్నారు. అంటే జైళ్లలో ఉన్న వారిలో నూటికి 76 మంది తమ నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న వారు కాదు, కేవలం విచారణలో ఉన్నవాళ్లే కావడం గమనార్హం. క్షణికావేశం కారణంగానో, ఇతరత్రా కారణాల వల్ల నేరాలకు పాల్పడే వారిలో మానసిక పరివర్తన తేవడమే జైలు శిక్షల అసలు లక్ష్యం. కిక్కిరిసిన ఖైదీలు, సిబ్బంది లేమి వంటి సమస్యలతో ఇండియాలోని కారాగారా లు నరకానికి నకళ్లుగా మారాయి. సామార్థ్యానికి మించి ఖైదీలను జైళ్లలో కుక్కడం భారత్‌లో ప్రధాన సమస్యగా ఉంది. దేశంలో అన్నీ కలిపి దాదాపు 1,350 జైళ్లు ఉండగా వాటి సామార్థ్యం కేవలం 4 లక్షలు. కానీ ప్రస్తు తం వీరి సంఖ్య 6 లక్షల వరకు ఉంటుం ది. అన్ని జైళ్లలో ఉండాల్సిన వారి కన్నా ఖైదీలు సగటున 118 శాతం అధికంగా ఉన్నారు.
ఖైదీల సంఖ్య పరంగా కేంద్ర కారాగారాల పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నది. జిల్లా జైళ్లలోనూ పరిస్థితి అలాగే ఉన్నది. చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీల సంఖ్య 150 శాతాన్ని దాటిపోయింది. జైళ్లకు కేటాయిస్తున్న నిధులు, వేస్తున్న ఖర్చుకు చాలా వ్యత్యాసం ఉంటున్నది. దేశంలోని అన్ని జైళ్లు కలిపి 3,320 మంది ఆరోగ్య సిబ్బం ది ఉండాలి. కానీ ఆ సంఖ్య 60 శాతం కూడా దాటడం లేదు. మహిళా వైద్యాధికారుల సంఖ్య తక్కువగా ఉంటున్నది. దేశ వ్యాప్తంగా వివిధ కోర్టులో పరిష్కారం కాకుండా ఉన్న కేసుల సంఖ్య 2025 నాటికి సుమారు 5 కోట్ల వరకు చేరుకునే అవకాశముంది. కోట్ల కొద్ది కేసులు పెండింగ్ వల్ల కక్షదారులపై ఏటా 30 వేల కోట్ల భారం పడుతున్నది. ఈ లెక్కన దేశం ఏడాదికి 50 వేల కోట్ల ఉత్పాదకతను సష్టపోతున్నట్లే.
మౌలిక వసతులు కరువు..
వందేళ్ల క్రితం నిజాం స్టేట్‌కు హైకోర్టుగా వ్యవహరించిన భవనాన్నే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుగా వ్యవహరిస్తున్నారు. అయి తే ఈ భవనం ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేదు. హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు పూర్తి స్థాయిలో పనిచేస్తే కనీసం కూర్చోవడానికి సీటు దొరకని స్థితి ఉంది. హైకోర్టులో గుర్తింపు పొందిన సీనియర్ న్యాయవాదులు 80 మందికి పైగా ఉండగా వారికి కనీసం కూర్చోనేందుకు ఛాంబర్లు లేవు, మరుగుదొడ్లు సైతం సరిపడా లేవు. దీంతో మహి ళా న్యాయవాదులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సత్వర న్యాయం అందించడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కోర్టుల్లో ప్రస్తుతం 10 లక్షల కేసు లు పరిష్కారానికి నోచుకోకుండా ఉండటం చాలా బాధాకరం.
ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు దశాబ్దాల క్రితం 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 17వేల ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు అంశం తొలిసారి తెరమీదకు వచ్చింది. కాని అది నేటికి కార్యరూపం దాల్చలేదు. లైంగిక దాడులు, వేధింపుల నుంచి బాలికలను రక్షించడానికి 2012లో పోక్సో చట్టం రూపొందించారు. ఆ చట్టం నిబంధనల కింద 1,023 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నెలకొల్పాలని నిర్ణయించగా.. ఇప్పుడు పని చేస్తున్నవి 681 మాత్రమే. దేశంలో పలు కోర్టుల్లో పరిష్కారానికి నోచుకొని కేసులు దాదాపు నాలుగు కోట్లుండగా.. వాటిలో 30 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోనివి లక్షా 20 వేలు కాగా, 10 ఏండ్లు మించిన కేసులు 10 లక్షలకు పైగానే ఉన్నాయి.
జడ్జీలపై పని భారం..
2025లో దేశవ్యాప్తంగా మంజూరు చేసిన పోస్టుల్లో 33 శాతం జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా అలహాబా ద్, మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక్కో న్యాయమూర్తిపై 15 వేల కేసుల పని భారముంది. ఇక తెలంగాణలో 42 మంది జడ్జీలకు గా ను 30 మందే ఉన్నారు. సుమారు 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ర్ట జనాభా సుమారు 3.7 కోట్లు, వాస్తవంగా 8.8 లక్ష ల జనాభాకు ఒక హైకోర్టు జడ్జీ ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రతి 12.3 లక్షల మందికి ఒక హైకోర్టు జడ్జీలున్నారు. తెలంగాణలో ఒక్కో న్యాయమూర్తిపై 4వేల కేసుల పనిభారం పడుతోంది. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో 21 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఒక్కో న్యాయమూర్తిపై 2,200 కేసుల పనిభారం ఉన్నది.
తెలంగాణలో జిల్లా కోర్టుల్లో 655 మంది జడ్జీలకు 440 మం దే ఉన్నారు. సుమారు 216 పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. మన దేశంలో 1987లో ఏర్పాటైన న్యాయ కమీషన్ ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. అమెరికాలో ఇదే 10 లక్షల జనాభాకు జడ్జీల సంఖ్య 150గా ఉం ది. యూరప్‌లో ఈ సంఖ్య 220గా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి 10 లక్షల మంది జనాభాకు 50 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. మ న దేశంలో మాత్రం 21 నుంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 146 కోట్ల జనాభాకు దేశంలోని అన్ని కోర్టులు కలిపి 73 వేల మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ఆ సంఖ్య 20వేలు మాత్రమే ఉంది. దేశం లో సరిపోను న్యాయమూర్తులు లేకపోవడంతో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఇక తెలంగాణలోని సివిల్, క్రిమినల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2.5 లక్షలకు పైమాటే. నేషనల్ జ్యూడీషియల్ డేటా ప్రకారం ఉన్నత న్యాయ స్థానాల్లో 17 లక్షల కేసులు, జిల్లా స్థాయి కోర్టుల్లో దాదాపు 3 కోట్ల 81 లక్షలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో సివిల్ కేసులు నిర్ణాయక దశకు చేరుకోవడానికి 15 ఏండ్లు, క్రిమినల్ కేసుల పరిష్కారానికి ఏడేండ్లు పడుతున్నది. ఈ లెక్కన ఇప్పుడున్న న్యాయమూర్తులతో కేసులు పరిష్కరించాలంటే దాదాపు 320 సంవత్సరాలు పడుతుంది. ఈ కేసులన్నింటిని సకాలంలో పరిష్కరించడానికి అద నంగా లక్ష మంది న్యాయమూర్తులు అవసరం. రాబోయే మూడు దశాబ్దాల్లో ఏటా 15 కోట్ల కేసులు నమోదు పెరిగే అవకాశముందని అంచనా. ఈ ఒత్తిడిని తట్టుకో వాలంటే న్యాయస్థానాల్లో సదుపాయాలతో పాటు భారీగా న్యాయమూర్తులను నియమించాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సెల్: 9963027577
కపిలవాయి దిలీప్ కుమార్