calender_icon.png 11 January, 2026 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తకొండ జాతరకు వేళాయే!

10-01-2026 12:00:00 AM

నేటి నుంచి వీరభద్రస్వామి జాతర :

ఉత్తర తెలంగాణ జిల్లాలో భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ది చెందిన వీరభద్రస్వామి ఆలయం జాతరకు సిద్ధమయింది. కోరమీసాల స్వామిగా చరిత్రకెక్కిన ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయం అతి పురాతనమైనది. క్రీ.శ.1600వ సంవత్సరం కాలంలో వంట చెరుకు కోసం కొంతమంది కుమ్మరులు ఎడ్లబండ్లతో కొండపైకి వెళ్లారు. వంట చెరుకు దొరికిన తరువాత అలసిపోయిన కుమ్మరులు అక్కడే నిద్రపోయారు.

కాసేపటి తరువాత లేచి చూడగా, ఎడ్లు కనబడకపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారు. ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నుంచి కిందికి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్టిస్తే వారి ఎడ్లు దొరుకుతాయిని చెప్పడంతో, గుట్ట కింద వీరభద్రస్వామిని ప్రతిష్టించినట్లు, ఈ క్రమం లో స్వామివారి కాలు విరిగినట్లు స్థానికులు తెలుపుతుంటారు. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ల మధ్య నిర్మించబడింది.

ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండడం వీరభద్రస్వామి మహత్యమే అని గ్రామ ప్రజలు చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి ముందురోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతరలో ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. సంక్రాంతి రోజున ప్రజలు ఎద్దుల బండ్లలో వచ్చి మొక్కులు సమర్పిస్తారు. ప్రతీ సంవత్సరం పుష్య బహుళ పంచమినాడు 10 రోజులపాటు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది.

జనవరి 10న శ్రీ వీరభద్రస్వామి కల్యాణంతో బ్రహ్మోత్సవాలతో ప్రారంభమవుతుంది. 11న త్రిశూల పూజ, 12న వాస్తు పూజ,13న లక్ష బిల్వార్చన,14 న భోగి పండుగ, 15న మకర సంక్రాంతి పురస్కరించుకొని ఉత్తరాయణ పుణ్యకాలం బండ్లు తిరుగుట(జాతర), 16న కనుమ వేడుక పుష్ప యాగం, 17న మహా పూర్ణాహుతి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు అనంతరం స్వామివారి గ్రామ పర్యటన జాతరలో ముఖ్య ఘట్టాలు. ఏటా సంక్రాంతి జాతర సందర్భంగా భక్తులు గండాలు తీరాలని గండదీపం, వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం.

వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు బీరభద్రపల్లెరం చేస్తారు. స్వామి వారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు. ప్రతి ఒక్కరు వీరభద్ర స్వామిని దర్శించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవాలి. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే గాక సిద్దిపేట, హుస్నాబాద్, కరీంనగర్, జగిత్యాల,పెద్ద పల్లి, హుజురాబాద్, జమ్మికుంట, హైదరాబాద్ నుంచి భక్తులు వేలాదిగా వచ్చి దర్శనం చేసుకుంటారు.

 సతీశ్ రెడ్డి, భూపాలపల్లి