calender_icon.png 23 February, 2026 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయానా? భయానా?

23-02-2026 02:27:11 AM

అతిప్రేమను ఒలకబోసి

అంతరంగాలను అదుపులోకి 

తీసుకొని ఆటలాడించటం -

మంచిమాటల మల్లెలు 

చల్లి మనసులు గెలిచి

సొంత పనులు చక్కబెట్టుకోవటం 

సామోపాయం

బహుమతులు పంచిపెట్టి 

ప్రలోభాలకు గురిచేసి

బుద్ధిని బంధించి తనదారికి 

తిప్పుకోవటం 

ధనాన్ని ఇచ్చి కోరికలను నెరవేర్చి

తలలను వంచేలా చేసి ఆశయాలు 

సాధించటం - దానోపాయం

సన్నిహితుల మధ్య అపార్థాలు కలిగించి

అనుకున్న కార్యాలు సాధించటం 

బుద్ధిబలం ఉపయోగించి 

అంతఃకలహాలు రగిలించి

విధిలేని పరిస్థితులు సృష్టించి 

వశంచేసుకోవటం -భేదోపాయం

అన్యగతిలేని సందర్భాలు కల్పించి

బలప్రయోగమైనా చేసి తలచినది 

నెరవేర్చుకోవటం -

హెచ్చరికలతో హింసతో 

హృదయాలను గడ్డకట్టించి

కత్తులు చూపి బెదిరించైనా 

కాళ్లదగ్గరకు తెచ్చుకోవటం 

దండోపాయం

సామమా, దానమా, భేదమా, దండమా 

ఏ దారిలో నడిచినా 

సాధించేది గమ్యమా?

మనిషిని మానవత్వాన్ని 

కోల్పోవడమా?

అడ్డదారులు తొక్కి అందుకునేది 

విజయమా? 

నయానో? భయానో?

చరిత్ర చివర అడుగుతుంది 

నీ అభీష్టం నెరవేరిందా?

నీ జీవితం నెగ్గిందా?

నీ సామ్రాజ్యం నిలిచిందా?  

నయంతోనైనా భయంతోనైనా?