calender_icon.png 23 February, 2026 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలస జీవుల గొంతుక ‘ముకురాల’

23-02-2026 02:27:32 AM

‘ఇదే దేవరకొండ.. ఇదే దేవరకొండ.. ఇట ఎన్నడో ఎగిరెనటరా తెలుగు జెండా’ అంటూ నాటి దేవరకొండ చారిత్రక వైభవాన్ని అక్షరబద్ధం చేసిన కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో ఆయన విద్యార్థిగా భాగస్వామి అయ్యారు. నాటి గ్రంథాలయోద్యమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. ఆయన అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాలలో 1929 జనవరి 1న ఆయన జన్మించారు. తాను పుట్టిన గ్రామం పేరే ఆయన ఇంటిపేరు స్థిరపడిపోవడం ఆయన జీవితంలోని విశేషం. వీధి బడిలో మొదలైన ఆయన విద్యాభ్యాసం విశ్వవిద్యాలయం వరకూ సాగింది. తెలుగు, చరిత్ర విభాగాల్లో ఆయన ఎంఏ పూర్తి చేశారు.

‘ప్రాచీనాంధ్ర కవిత  పరిణామాలు’ అనే అంశంపై పరిశోధన చేసి ఆయన డాక్టరేట్ అందుకున్నారు. ఆయన బహుభాషా కోవిదుడు. తెలుగుతో పాటు ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, హిందీ భాషల్లో విశేషమైన పాండిత్యం సంపాదించారు. ఈ క్రమంలో ఆయన ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం ప్రారంభించారు. తెలుగు అకాడమీలో 17 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు.

ఉప సంచాలకుడిగా పదవీ విరమణ చేసే వరకు తెలుగు భాషా వికాసానికి ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా పరిపాలనా న్యాయ పదకోశం తయారీలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయం. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి రచన ఒక ఆణిముత్యం. 1957లో వెలువడిన ‘దేవరకొండ దుర్గం’ కావ్యం ఆయనకు రాష్ట్రవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘నవ్వే కత్తులు’ అనే జాతీయ విప్లవ కావ్యం ద్వారా సామాజిక మార్పును ఆకాంక్షించారు.

కాళిదాసు మేఘసందేశాన్ని ‘మేఘదూత’ పేరుతో గేయ రూపంలోకి అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు. ‘హృదయ శైలి’ గేయ సంపుటిలో ఆయన మానవతా దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. పాలమూరు వలస కూలీల వ్యధలను వివరిస్తూ ఆయన రాసిన ‘పాలమూరు జాలరీ’ పాట ఇప్పటికీ ఒక సంచలనం. ‘ఎన్నడొస్తవు లేబరీ.. పాలమూరు జాలరీ‘ అని పాడిన ఆయన గొంతు వేలాది మంది వలస జీవుల ఆవేదనకు ప్రతిరూపంగా నిలిచింది. 

1977లో వచ్చిన ఉప్పెనలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన పాలమూరు జాలర్ల దీనస్థితిని చూసి ఆయన చలించిపోయారు. ఆ ఆవేదన నుంచే పుట్టిన ఈ పాట తెలంగాణా జానపద సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి. జూరాల ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్లే తమ ప్రాంత రైతులు వలస వెళ్తున్నారని ఆయన తన రచనల ద్వారా పాలకులను నిలదీశారు. రామారెడ్డి కేవలం భావోద్వేగ కవి మాత్రమే కాదు.. గొప్ప పరిశోధనాత్మక దృష్టి ఉన్న మేధావి. ‘సాహిత్య సులోచనాలు’ అనే వ్యాస సంపుటి ద్వారా విమర్శనా రంగంలో తనదైన ముద్ర వేశారు.

పద్యం, పాట, కథ, వ్యాసం.. ఇలా ఏ ప్రక్రియ చేపట్టినా, వాటిలో సామాజిక స్పృహ జోడించడం ఆయన ప్రత్యేకత. ఆయన రాసిన ‘పుట్టగోచి లింగ పూల రంగ’ శతకం సమాజంలోని కుళ్లును కడిగిపారేసే వ్యంగ్యాస్త్రమైంది. ‘రాక్షస జాతర’ వంటి దీర్ఘ కవితతో ఆయన సమకాలీన రాజకీయాల్లోని కుళ్లును ఎండగట్టారు. ‘క్షణకోపం కోపక్షణం’ వంటి కథల ద్వారా మనిషి నైజంలోని లోపాలను సునిశితంగా విశ్లేషించారు.

కవిత్వం కేవలం వర్ణనలకే పరిమితం కాకూడదని, అది సామాన్యుడి గొంతుక కావాలని ఆయన బలంగా నమ్మారు. అందుకే.. ఆయన రచనల్లో తెలంగాణ మట్టివాసన, ఇక్కడి ప్రజల ఆవేదన స్పష్టంగా కనిపిస్తాయి. ముకురాల రామారెడ్డి గొంతు కంచు కంఠంలా ఉండేది. కవి సమ్మేళనాల్లో ఆయన పద్యం పాడుతుంటే శ్రోతలు పరవశించిపోయేవారు. వక్తగా కూడా ఆయన ఎంతో రాణించారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటిచెప్పారు.

‘కల్వకుర్తి సాహితీ సమితి’ వంటి సంస్థల ద్వారా ఎందరో యువ కవులను ప్రోత్సహించారు. ముకురాల ప్రతిభను గుర్తించిన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం 1976లో ఆయన్ను ‘జాతీయ కవి’గా సన్మానించింది. తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఆయనకు తన విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2003 ఫిబ్రవరి 24న ఆ మహనీయుడు కన్నుమూశారు. ఆయన సాహిత్యమంతా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలు. అవే తెలంగాణకు అజరామర స్మృతులు.

రతన్ రుద్ర