4 March, 2026 | 10:54 AM

యోగి ఆదిత్యనాథ్‌తో రేవంత్‌రెడ్డికి పోలికా?

04-03-2026 12:26 AM
  1. కొందరు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు
  2. బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): కొందరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని, రేవంత్ రెడ్డిని పోలుస్తూ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ మండిపడ్డారు. యూపీలో బుల్డోజర్ చర్యలు ప్రభుత్వ భూ ములను ఆక్రమించినవారిపై, మాఫియా, క్రిమినల్ ఎలిమెంట్స్‌పై మాత్రమే జరుగుతున్నాయన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రజా హక్కులను కాపాడుతూ, నేరస్థులపై, అక్రమ నిర్మాణాలపై మాత్రమే బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

కానీ తెలంగాణలో మాత్రం లీగల్ నిర్మాణాలపైనా, పేదల ఇండ్లను కూల్చుతూ గడ్డపార ప్రభుత్వంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావుతో కలిసి మీడియాతో ఆయన మాట్లా డారు. కేరళలో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు పంపాలంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు. 

వైద్యం చేయించుకోలేక, రిటైర్మెంట్ డబ్బులు రాక, అప్పుల భారం తట్టుకోలేక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. సీఎం రూ.1000 కోట్లు ఇస్తాననడం దారుణమన్నారు. దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ వెలుగుమట్లలోని భూదాన్ భూములపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయాలని, ఈ అంశంపై జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.