13 May, 2026 | 12:54 AM

ప్రజల ధాన్యం పందికొక్కుల పాలేనా..!?

03-09-2025 12:00 AM

రైస్ మిల్లుల్లోనే మూలుగుతున్న లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు ఎఫ్ సీఐ, సీఎంఆర్‌కి అప్పగించని వైనం..

అయినా చర్యలు శూన్యం..

గత పాలనలో అవినీతి అక్రమాలు నేటి పాలనలోనూ చర్యలకు వెనకడుగు

నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాజుల సొమ్ము రాళ్లపాలు అనే నానుడిని నిజం చేసే విధంగా రైతన్నలు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మిల్లర్లు అమాంతం బుక్కేసి పందికొక్కులు మేసాయన్న సాకు చూపాలని ఉద్దేశంతో ఏళ్లకు ఏళ్ళుగా ఆయా మిల్లులోనే ధాన్యాన్ని నిల్వ చేసుకొని మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాటిని తరచూ పర్యవేక్షణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం నెలవారి మామూళ్లకు అలవాటు పడి రైస్ మిల్లర్లకు వంత పాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అడుగులకు మడుగులొత్తుతూ వారి కార్యక్రమాల ఖర్చులకు డబ్బులు ముట్ట చెబుతూ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైస్ మిల్లులను తరచూ తనిఖీ చేయాల్సిన అధికారులు సైతం కన్నెత్తి చూడలేదు. దాని ఫలితంగా 2022-23 ఖరీఫ్, రబీ సీజన్ మొత్తంగా లక్ష 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికీ రికవరీ కాకుండా పోయిందని విమర్శలు ఉన్నాయి.

దాంతోపాటు 2023-24 ఏడాది ఖరీఫ్, రబీ సీజన్ల లోనూ ఆయా మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రాత్రిళ్ళు సరఫరా చేసుకొని సొమ్ము చేస్తుకున్నా పట్టించుకోలేదన్న వాదన వినిపి స్తోంది. చాలాకాలంగా ప్రభుత్వానికి తిరిగి బియ్యం ఇవ్వకుండా గ్రామాల్లోని ప్రజల నుండి సేకరించిన రేషన్ బియ్యన్ని తిరిగి ఆయా రైస్ మిల్లర్ల ద్వారా ప్రభుత్వానికి రీసైక్లింగ్ చేసి కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అలాంటి రైస్ మిల్లులపై చర్యలు తీసుకొని ధాన్యం రికవరీ చేయని రైస్ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టి వారికి మరోసారి ధాన్యం కేటాయించకుండా చర్యలు తీసుకున్నారు. దాని ఫలితంగా 2023 24 ఏడాదికి సంబంధించిన ఖరీఫ్ రబీ సీజన్లో సుమారు 40 శాతం సిఎంఆర్, ఎఫ్సిఐకి తిరిగి ఇప్పించగలిగారని అధికార వర్గాలు చెబుతు న్నాయి. కానీ వాస్తవరూపం మాత్రం అందు కు భిన్నంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2022-23 ఖరీఫ్ రబీ సీజన్లలో ఇప్పటికీ 1,16 వేల మెట్రిక్ టన్నుల పైగా బకాయి ఉండగా 2023-24 ఏడాదికి సంబంధించి ఇంకా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయిపడి ఉందని ఆయా మిల్లర్లు 2024-25 ఏడాదిలో సేకరించిన ధాన్యాన్ని లెక్కలోకి చూపి తప్పించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని రైస్ మిల్లర్లు ఆయా గ్రామాల నుండి సేకరించిన రేషన్ బియ్యంతో పెండింగ్ ఏసీకే లను చూపి తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు రెవెన్యూ, పోలీస్, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు సైతం తెరవెనక సంపూర్ణ సహకారం అందిస్తున్నారని ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి.

రాత్రి ళ్ళు అడ్డగోలుగా ఇతర రాష్ట్రాలకు వరి ధాన్యాన్ని తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోగా ఫిర్యాదులు చేసిన వారిపైనే దాడులు జరిపిన ఘటనలు కూడా లేకపోలేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ఏర్పాటు నుండి ఇప్పటిదాకా నాగర్ కర్నూల్ జిల్లాలో రైస్ మిల్లర్ల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి, మెప్మా, సివిల్ సప్లై కొనుగోలు కేంద్రాల ద్వారా ఆయా రైస్ మిల్లర్లకు వరి ధాన్యాన్ని అప్పగిస్తూ అట్టి ధాన్యాన్ని బియంగా మార్చి ప్రభుత్వానికి పంపే క్రమంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని చర్చ జరుగుతుంది.

గత ప్రభుత్వ హయాంలోని ఎమ్మెల్యేలు వారికి వంత పాడిన రైస్ మిల్లర్ల నుండి మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యా చరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ జిల్లాలోని కల్వకుర్తి ప్రాంతంలోనే అత్యధికంగా రైస్ మిల్లర్లు అక్రమ దందా నడిపి స్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2023-24 ఖరీఫ్ సీజన్ లో ఎఫ్ సిఐ, సీఎంఆర్ టార్గెట్ 49,368 మెట్రిక్ టన్నులు కాగా 46,256 టన్నుల ధాన్యం డెలివరీ అయింది. మరో 3,112 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడింది. రబీ సీజన్లో 36,220 మెట్రిక్ టన్నులు కాగా 36,019 సీఎంఆర్ డెలివరీ పూర్తయింది. మరో 209 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడింది.

2024-25 ఖరీఫ్ సీజన్లో 90,324 మెట్రిక్ టన్నులు టార్గెట్ కాగా 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం డెలివరీ పూర్తయింది. మరో 30,324 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడింది. రబీ సీజన్లో 1,24,666 మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ కాగా  36,167 డెలివరీ పూర్తయింది. మరో 88,499 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ 2022-23 ఖరీఫ్ & సీజన్ లో 10,856.266 మెట్రిక్ టన్నులు పూర్తిగా బకాయి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొండి బకాయిలను రికవరీ చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రస్తుతం ఆ ధాన్యం పందికొక్కులు మింగేసాయి అనే సాకు చూపి అమాంతం ఎగ్గొట్టాలని కుట్రలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో ఎలాగైనా పూర్తి స్థాయిలో రికవరీ చేయాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా ఏర్పరచుకుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రికవరీ చేయలేని ఆయా మిల్లర్లపై పీడియాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. కానీ జిల్లాస్థాయి సివిల్ సప్లై పవర్ సర్ఫరాల శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా అన్న అనుమా నాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుత నియోజక వర్గం ఎమ్మెల్యేలు సైతం ఆయా రైస్ మిల్లర్లకు సానుకూలంగా స్పందిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పూర్తిస్థాయిలో రికవరీ చేసేందుకు చర్యలు చేపడతాం.

 2022,23 ఏడాదిలోని ఖరీఫ్ రబీ సీజన్లో తో పాటు ఇప్పటివరకు ఆయా రైస్ మిల్లర్లకు కేటాయించిన వరి ధాన్యం పూర్తిస్థాయిలో రికవరీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. గతంలోనే నిర్లక్ష్యం వహించిన రైస్ మిల్లర్లను బ్లాక్లిస్టులను ఉంచాం. మరింత మొండిగా వ్యవహరించే రైస్ మిల్లర్ల నుండి కూడా వసూలు చేసేందుకు ముందుకు వెళ్తున్నాం. 

 నరసింహారావు, పౌరసరఫరాల శాఖ అధికారి, నాగర్ కర్నూల్ జిల్లా.