18 July, 2026 | 8:16 PM

వర్షాలు కురవాలని వానదేవుడిని వేడుకున్న షేక్‌పల్లి గ్రామస్తులు

18-07-2026 07:43 PM

ఎర్రవల్లి: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని షేక్‌పల్లి గ్రామస్తులు శనివారం ప్రత్యేకంగా వానదేవుడిని ప్రార్థించారు. గ్రామంలోని మహిళలు, పురుషులు, యువత కలిసి ఎడ్లబండిపై సంప్రదాయ పద్ధతిలో షేక్‌పల్లి నుంచి బీచుపల్లి వరకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరం భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ, వానదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. అనంతరం బీచుపల్లి అంజన్న స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించడంతో పాటు గ్రామానికి మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు.