calender_icon.png 24 February, 2026 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది ప్రజాపాలనా?.. లేక పెనాల్టీ పాలనా?

24-02-2026 01:24:54 AM

కేంద్రమంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుం దా? లేక పెనాల్టీ పాలనా? అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ట్రాఫి క్ చలాన్లలో 154 శాతం వృద్ధి నమోదు కావడంపై ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ఒక ఏడాదిలోనే రూ. 108.33 కోట్ల నుంచి రూ.275.05 కోట్లకు పెరిగింది...అంటే 2.5 రెట్లు ఎక్కువని తెలిపారు.

మరీ రోడ్లు 2.5 రెట్లు మెరుగుపడ్డాయా? గుంతలు 2.5 రెట్లు తగ్గిపోయాయా?, ట్రాఫిక్ నిర్వహణ 2.5 రెట్లు మెరుగైందా? అని నిలదీశారు. కానీ, జరిమానాలు మాత్రం రెండింతలకు మించి పెరిగాయని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చలాన్లను నేరుగా బ్యాంకు ఖాతా నుంచి ఆటోడెబిట్ చేయాలంటున్నారని అన్నారు. ముందు జరిమానాలు పెంచండి...తర్వాత టార్గెట్లు పెట్టండి... ఇప్పుడు ఆటోడెబిట్ చేయండని, ఇది పాలన కాదు...ఇది ఆటోమెటెడ్ దోపిడీలా ఉందని విమర్శించారు. 

సీఎంగారు.. మీకు ప్రజా సమస్యలు పట్టవా?

సీఎం గారు....రాష్ట్ర మంత్రివర్గంలో డూ ప్లికేట్ గాంధీ కుటుంబానికి పంపాల్సిన రూ. వెయ్యి కోట్ల నిధుల సేకరణపైనే చర్చ జరుపుతున్నారా? లేక అవ్వాతాతలకు ప్రతినెలా రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇవ్వడంపై కేబినెట్‌లో ఎన్నడైనా చర్చించారా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. డూ ప్లికేట్ గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు పంపాలనే శ్రద్ధే తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టవా?అని ప్రశ్నించారు.

ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. మహిళలకు ప్రతినెలా రూ.2,500, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగభృతి ఎప్పుడి స్తారని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు పర్చకుంటే బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.