గెలుపే పరమావధియా?

16-09-2026 | 05:10am

పాలకుర్తి రామమూర్తి :

సంధిః పరిపణితశ్చ అపరిపణితశ్చ

(కౌటిలీయం-7-6)

రాజుకు బలం తక్కువగా ఉన్న సమయంలో ఎంతో శాంతంగా, తన తక్కువతనాన్ని ఓర్చుకుంటూ, తన వలెనే అనాదరణకు గురైన ఇతరులను కలుపుకొని, అనుకూల సమయంలో శత్రువు(Enemy)పైన దెబ్బతీయాలి. అలా ముగ్గురు రాజుల మధ్య వైరం ఉన్న సమయంలో ఇరువురు విజిగీషువులు కలసి (గెలవాలనే సంకల్పం కలిగిన రాజులు) యాతవ్యునిపై (ఎవరిపైనైతే దండయాత్రకు వెళ్లానుకుంటున్నారో అతనిపై) దండెత్తాలి. నిజానికి ఈ ఇరువురూ శత్రువులే కాని మూడవ వానిని జయించాలి కాబట్టి కలుస్తున్నారు.

అలా దండెత్తే సమయంలో విజిగీషువుల మధ్య జరిగే ఒప్పందాన్ని సంధిగా భావించవచ్చు... ‘నీవు ఈ పక్క నుంచి వెళ్లు నేను ఆ పక్క నుండి వెళ్తాను. లాభం సమానంగా పంచుకుందాము’ అని చేసుకునే ఒప్పందం ప్రకారం లాభం సమంగా ఉంటే సంధిని గౌరవించాలి, లేకపోతే పరాక్రమాన్ని చూపాలి అంటాడు, ఆచార్య చాణక్య(Acharya Chanakya). దీనిని సూక్ష్మంగా పరిశీలిస్తే పాలకుల మధ్య ‘శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు’ అనే భావనకన్నా వారివారి శాశ్వత రాజ్యప్రయోజనాలే ముఖ్యమైనవిగా కనిపిస్తుంది.

ఒక శత్రువు బలవంతుడైన సమయంలో తనకు సహాయపడే రాజును ఒక మార్గంలో ఒక ప్రదేశంలో ముట్టడికి పంపి తాను మరొక మార్గంలో మరొక ప్రదేశంలో ముట్టడించడం శ్రేయస్కరం. మహాభారతం(Mahabharata) విరాటపర్వం(Virata Parva)లో విరాటరాజు గోవులను పట్టుకునేందుకు సుశర్మను దక్షిణం వైపునకు పంపి, కౌరవులు(Kauravas) ఉత్తరం వైపునకు వెళ్లడం కనిపిస్తుంది. దీనిని ఒకే లక్ష్యం కోసం శత్రువుపై వేరువేరు దిశల నుంచి ఒత్తిడి తేవడమనే సాధారణ సైనిక సూత్రంగా చెప్పుకోవచ్చు.

సంధి రెండు విధాలుగా ఉంటుంది, పరిపణితసంధి, అపరిపణితసంధి. షరతులతో కూడిన సంధిని పరిపణితసంధి అంటారు.. షరతులు ఏవీ లేకుండా చేసుకునే సంధిని అపరిపణితసంధి అంటారు. రాజనీతి(Statecraft)లో సంధి అనేది పరస్పర స్నేహసంబంధాలు కాదు.. వారివారి ప్రయోజనాల కోసం ఏర్పడే తాత్కాలిక సహకారం మాత్రమే అనుకోవచ్చు.

 ‘నీవు ఈ దేశానికి వెళ్లు నేను ఈ దేశానికి వెళ్తాను’ అంటూ దేశం గురించి మాట్లాడుకొనే ఒప్పందం పరిపణితదేశసంధి. ‘నీవు ఇంతకాలం యుద్ధం చేయి నేను ఇంతకాలం యుద్ధం చేస్తాను’ అని కాలావధి గురించి మాట్లాడుకొనే ఒప్పందం పరిపణితకాలసంధి. ‘నీవు ఇంత పనిచేయి, నేను ఇంత పనిచేస్తా’ అని చేసుకునే ఒప్పందం పరిపణితార్థసంధి.

యుద్ధానికి వెళ్లే ప్రదేశం పర్వతదుర్గాలతో, దట్టమైన అడవులతో, నదులతో ఉండవచ్చు... ఆహారధాన్యాల రవాణా, మనుష్యుల రాకపోకలు, సైన్యసంచారానికి అనువుగా ఉండకపోవచ్చు. తాగునీరు, పశుగ్రాసం లభించకపోవచ్చు. పూర్వపరిచితం కాని ప్రదేశంలో సైనిక కార్యకలాపాలకు విఘాతం కలుగవచ్చు. అలాంటి సమయంలో పరిపణితదేశసంధి కుదుర్చుకొని రెండవవానిని ఆ ప్రదేశం గుండా వెళ్లేటట్లు చూడాలి.

వాతావరణ పరిస్థితులు(Weather conditions) అనుకూలంగా లేకున్నా, అధికవర్షాలు పడినా, వ్యాధులు ప్రబలినా సైనిక వ్యవహారాలకు అవరోధాలు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి కాలావధిని నిర్ణయించుకొని పరిపణితకాలసంధిని చేసుకోవాలి. కార్యఫలితాన్ని సాధించేందుకు చాలాకాలం పట్టవచ్చు. ఖర్చు అధికం కావచ్చు. అనర్థాలు వెనుకొనవచ్చు. అలాంటి సమయంలో పరిపణితార్థసంధిని కుదుర్చుకోవాలి. ఈ విధంగా దేశకాలాలను, కార్యకాలాలను, వ్యయప్రయాసలను దృష్టిలో పెట్టుకొని దేశపరిపణితసంధి, కాలపరిపణితసంధి, కార్యపరిపణితసంధి అనే ఒప్పందాలని ఏర్పరచుకోవాలి.

గెలవాలనే బలీయమైన సంకల్పం కలిగినవాడు, సదా అప్రమత్తంగా ఉంటూ, ఎదుటివానిలో విశ్వాసాన్ని కల్పిస్తూ, అవకాశం వచ్చినప్పుడు దెబ్బతీయడమనేది అపరిపణితసంధిగా చెప్పుకోవచ్చు.

మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుతో.. ‘బలవంతులను ఆశ్రయించి వారి అండదండలతో శత్రువును నిర్జించాలి. గారడీచేసయినా, పగవాడి స్నేహితుల మధ్యన కలహాలు పెట్టయినా, శత్రువును సాధించాలి’, అంటాడు. అంతేకాదు, రాజధర్మం, ఆపద్ధర్మం, క్షాత్రధర్మం, యుద్ధధర్మం అన్నీ ఒకే స్థాయిలో ఉండవు... సందర్భం మారితే ధర్మానికి వర్తించే నియమాల వివరణ కూడా మారుతుందనే సూత్రాన్ని మరచిపోకూడదు.

యుద్ధకళ గురించి చెపుతూ ‘సన్ ట్జు‘ అనే చైనా సైనిక జనరల్, వ్యూహకర్త... శత్రువును, భూభాగాన్ని, పరిస్థితులను, సైనిక సామర్థ్యాన్ని, పొరుగు దేశాల వ్యూహాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారితో చేతులు కలపరాదంటాడు. శత్రుదేశాన్ని మొత్తంగా, యథాతథంగా స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలను రచించుకోవాలి. యుద్ధంలో విజయాన్ని సాధించాలంటే జిత్తులమారి తనం, రహస్యం అనేవి మంచి కళలు. వాటి ద్వారా అదృశ్యంగా ఉంటూ శత్రువు తలరాతను మన చేతులతో లిఖించవచ్చు, అంటాడాయన.

అలాగే శత్రువును స్వాధీనం చేసుకోవాలే కాని పూర్తిగా ధ్వంసం చేయడం సరికాదు, అలాచేస్తే ఆర్థిక వ్యవస్థ నాశనం కావచ్చు, మౌలిక సదుపాయాలు దెబ్బతినవచ్చు, ప్రజలు తిరుగుబాటు చేయవచ్చు. దానితో గెలిచిన రాజ్యాన్ని పాలించడం కష్టమవుతుంది. కాబట్టి విజయం విధ్వంసం కాకూడదనేది ‘సన్ ట్జు’ అభిప్రాయం. మహాభారతం కురుక్షేత్రం చివరలో ధర్మరాజుతో ‘గుర్రములు ఏనుగులు లేని రాజ్యము నీ తలనే గొట్టుకొనుము’ అంటాడు, దుర్యోధనుడు. పాండవులు గెలిచినా... ఆత్మీయుల మరణాలు, ఆర్థిక సంక్షోభం వారి విజయాన్ని నిరర్ధక విజయంగా మార్చింది, అంటాడు.

ఎప్పుడైనా శత్రువు మీ వద్దకు రావడం మంచిది. అలా రప్పించుకోవడమే మేలైన పని. అద్భుతమైన లాభాల ఎరను చూపి అతడిని ఆకర్షించాలి.. ఆ తదుపరి దాడి చేయాలి అంటాడు.. రాబర్ట్ గ్రీన్ అనే రచయిత తన ‘శక్తి 48 సూత్రాలు’ అనే పుస్తకంలో. శత్రువు మీ వద్దకు వస్తే అతడిలో శక్తి తగ్గినట్లుగా భావించాలి. మీరు బలంగా ఉన్నప్పుడు శత్రువుపై దాడి చేయడం.. గుడ్ల మీద రాళ్లువేయడం అంటాడాయన.

ఇలా శత్రువును సాధించే ప్రక్రియలో భారతం నుంచి నేటి దాకా యుద్ధకళల వ్యూహకర్తలు రాజనీతిలో భాగంగా వివిధ మార్గాలు చూపారు. కాలం, సందర్భం, లక్ష్యాలు వేరువేరయినా, ప్రత్యర్థి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, అతని కదలికలను ప్రభావితం చేయడం, బలాన్ని సరైన సమయంలో వినియోగించడం అనే వ్యూహాత్మక సూత్రాల్లో వీరి ఆలోచనలకు కొన్ని పోలికలు కనిపిస్తాయి.

చాణుక్యుని ఆలోచనలో రాజ్యప్రయోజనం, శక్తి సమీకరణం, సంధి, మిత్ర-శత్రు సంబంధాలు ప్రముఖంగా కనిపించగా ‘సున్ ట్జు’.. యుద్ధాన్ని వీలైనంత సమర్థవంతంగా గెలవడం, సమాచారం, మోసం, శత్రువు బలహీనతలను ఉపయోగించుకోవడం, అవసరం లేని విధ్వంసాన్ని నివారించడం లాంటి విధానాలకు ప్రాధాన్యతనిచ్చిన విధానం కనిపిస్తుంది.

అలాగే రాబర్ట్ గ్రీన్ దృష్టిలో  అధికార సంబంధాలలో ప్రత్యర్థి ప్రవర్తనను ప్రభావితం చేయడం, మానసిక వ్యూహాలు, ప్రత్యర్థిని తనకు అనుకూలమైన స్థితిలోకి రప్పించడం ముఖ్యమైనవిగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా గెలుపునకు బలానికన్నా... బలాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలిసిన వ్యూహాత్మక కార్యజ్ఞతయే నిర్ణయాత్మకమౌతుంది.

ఏ యుద్ధంలోనైనా ప్రత్యర్థిని ఓడించడం నిర్ణయాత్మక విజయం కావచ్చు.. కానీ యుద్ధం తర్వాత రాజ్య సుస్థిరత. ఆర్థిక వనరులు, పరిపాలనా సామర్థ్యం, ప్రజల మద్దతు నిలబెట్టుకోవడమే వ్యూహాత్మక విజయం.

అయితే ఇవన్నీ ధర్మబద్ధమా అంటే.. యుద్ధం ఆరంభించేంత వరకే ధర్మం, అధర్మమనే చింతన. యుద్ధం ఆరంభించాక గెలుపే పరమావధి. ఫలితమే మీ స్థాయిని నిర్ణయిస్తుంది. విజయం కోసం ఏదైనా చేయవచ్చు అనే చాణక్యుని భావన వాస్తవిక రాజనీతికి సంబంధించిన ఒక కోణాన్ని పట్టుకున్నప్పటికీ, దానిని మొత్తం భారతీయ ధర్మచింతనగా చెప్పడం సమంజసమూ కాదని గుర్తించాలి. 

మరిన్ని వార్తలు