1 April, 2026 | 2:37 AM

ఇస్ఫహాన్‌పై బంకర్ బస్టర్‌లతో దాడి

01-04-2026 12:42 AM
  1. ఒప్పందం కుదుర్చుకోకుంటే విధ్వంసం తప్పదు

వీడియో విడుదల చేసిన డొనాల్డ్ ట్రంప్

టెహ్రాన్: ఇరాన్‌లోని అణు కేంద్రాలున్న నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా భారీ దాడులకు పాల్పడింది. 2వేల పౌండ్లున్న బంకర్ బస్టర్ బాంబులతో ఆయుధ నిల్వలున్న డిపోపై దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమంలో విడుదల చేశాడు.

దాడికి సంబంధించి మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అమెరికా ఆయుధ నిల్వలున్న డిపోపై దాడులు చేసినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ దాడులపై ఇంకా ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇస్ఫహాన్‌లో ఇరాన్ 540 కిలోల యురేనియం నిల్వలను భూగర్భ కేంద్రానికి తరలించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు తమతో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆ దేశంలో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తా మని ట్రంప్ హెచ్చరించారు.

ఈ నేపథ్యంలోనే భారీ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంక్యూ రీపర్ డ్రోన్‌ను ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు సమాచారం. ఐఆర్జీసీ అధికార వర్గాలను ఉటంకిస్తూ పలు కథనాలు వెల్లడించాయి. ఈ డ్రోన్ ఇస్ఫహాన్‌లో ఎగురుతుండగా ధ్వంసం చేశామని పేర్కొన్నాయి.