లెబనాన్ బ్యూఫోర్ట్ కోటపై ఇజ్రాయెల్ పాగా
26 ఏళ్ల తరువాత లెబనాన్‌లో ఐడీఎఫ్ అతిపెద్ద షెల్టర్
బీరుట్, మే 31: దక్షిణ లెబనాన్‌లోని 900 ఏళ్ల పురాతన బ్యూఫోర్ట్ కోటను, దాని చుట్టూ ఉన్న కొండలను ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ అధికారులు విడుదల చేసిన ఫోటోలు, వీడియోలలో కోట వద్ద ఇజ్రాయెల్ జెండాలు ఎగురుతూ కనిపించాయి. రోజుల తరబడి జరిగిన భీకర పోరాటం, చుట్టుపక్కల గ్రామాలపై జరిపిన వైమానిక దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం ఈ ముందడుగు వేసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. ఇక ఇక్కడి నుంచి రాకెట్ లాంచింగ్ వ్యవస్థలపై దృష్టి పెడతామన్నారు. స్థానిక మీడియ కథనం ప్రకారం గత 26 ఏళ్లలో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబడటం ఇదే తొలిసారి.
1982 నుంచి 2000 వరకు దక్షిణ లెబనాన్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సమయంలో బ్యూఫోర్ట్ కోట ఒక ప్రధాన ఇజ్రాయెల్ సైనిక స్థావరంగా ఉండేది. 700 మీటర్ల ఎత్తున కొండపై నిర్మించబడిన ఇది, దక్షిణ లెబనాన్, ఇజ్రాయెల్‌లోని చాలా భాగాన్ని పర్యవేక్షించే ప్రదేశం. అందువల్ల దీని సైనిక ప్రాముఖ్యత అపారమైనదిగా భావిస్తారు. ఏప్రిల్ 17న ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య కాల్పుల విరమణ ప్రకటించినా, ఐడీఎఫ్ తన దాడులను కొనసాగిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందాలు ఖరారయ్యే ముందే హిజ్బుల్లాను లేకుండా చేయాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుందని పలువురు భావిస్తున్నారు.






