ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): TGSRTC కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ హెచ్చరించారు. బుధవారం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించిన సమ్మెలో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు సమ్మె చేయడం ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగ భద్రత కల్పించడం, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం, ఔట్‌సోర్సింగ్ మరియు PHB డ్రైవర్లను విలీనం చేయడం, మహాలక్ష్మి పథకం బకాయిలు చెల్లించడం, 2021 వేతన సవరణ అమలు చేయడం, ప్రైవేటీకరణను నిలిపివేయడం వంటి ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ ప్రైవేట్ చేతుల్లో ఉన్న బస్సులను జాతీయం చేసి ప్రజల ఆస్తిగా మార్చారని, ప్రస్తుతం అద్దె బస్సులు, ఈవీ బస్సుల పేరుతో మళ్లీ ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ చర్యల వల్ల వేలాది కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఎల్పుల అశోక్, AITUC జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, కార్మికులు మంజుల, ప్రేమేల, షఫీ, బాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.






