22 April, 2026 | 1:52 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి

22-04-2026 12:27 PM
  1. వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశం
  2. ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు
  3. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా కొనసాగింపు
  4. బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం,(విజయక్రాంతి): కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీలో బుధవారం చింతపల్లి నుంచి ముత్తగూడెం వరకు 6 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ... నేడు శంకుస్థాపన చేసిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను రాబోయే వర్షాకాలానికి ముందే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో, నిర్దిష్ట కాలపట్టికలో పూర్తి చేయాలని, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా పర్యవేక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ముత్తగూడెంకు గత కాలంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు, లింకు రోడ్ల అభివృద్ధికి కలిపి రూ.16 కోట్ల 70 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 

ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధితో పాటు పేదల సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా నిర్లక్ష్యం ఉండదని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 2 లక్షల వరకు రుణమాఫీ, రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి పంటకు రూ.6 వేల రైతు భరోసా, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకాలను కొనసాగిస్తూ, అదనంగా పేదలకు మరింత భరోసా కలిగించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

విద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా ఆగకుండా కొనసాగుతుందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని మంత్రి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మరిన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించాల్సిన అవసరం ఉందని, త్వరలోనే వీటిని చేపట్టి పూర్తి చేస్తామని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కూడా త్వరలో ప్రారంభ మవుతుందని మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ ఈ బీటీ రోడ్డు నిర్మాణం ప్రజలకు అత్యంత అవసరమని తెలిపారు. మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

మున్సిపాలిటీగా స్పష్టమైన మార్పు కనిపించాలంటే మంచి రహదారులు కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన 6 కోట్ల 50 లక్షలతో నిర్మించే ఈ రోడ్డు పనులు నాణ్యతతో, సకాలంలో పూర్తి అయ్యేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఈ రహదారి కనీసం 20 సంవత్సరాలకు పైగా ప్రజలకు ఉపయోగ పడేలా నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్&బి ఎస్ఈ యాకోబు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.