1 July, 2026 | 12:44 AM

‘డబుల్’ ఇండ్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

01-07-2026 12:00 AM

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

కోదాడ, జాన్ 30 : పట్టణంలోని బాలాజీ నగర్లో గత ప్రభుత్వం పేదల కొరకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి, తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి కోరారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ సూర్యపేట జిల్లా కమిటీ సభ్యులు జల్లా జనార్దన్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా జల్లా జనార్దన్ మాట్లాడుతూ ప్రజాధనంతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందక, సదుపాయాలు లేక వృథాగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన పర్యవేక్షణ లేకపోతే ఈ గృహాలు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకుని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ నాయక్, యాద నవీన్, సంధ్యారాణి, క్రాంతి, అన్నపూర్ణ,సైదాబి పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.