మాదాపూర్‌లో ఎండీఎంఏ విక్రయం ఐటీ ఉద్యోగి అరెస్ట్
7గ్రాముల డ్రగ్ స్వాధీనం పరారీలో ప్రధాన నిందితుడు పోలీసుల గాలింపు
శేరిలింగంపల్లి, ఆగస్టు 25(విజయక్రాంతి): మాదాపూర్ పరిధిలో ఎండీఎంఏ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆగస్టు 23 రాత్రి అందిన నమ్మదగిన సమాచారం ఆధారంగా మాదాపూర్ పోలీసులు షేక్ ఆమన్ అహ్మద్ (23)ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 7.02 గ్రాముల ఎండీఎంఏ, సెల్‌ఫోన్, కాలేజీ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. పంచనామాదారుల సమక్షంలో క్లూస్ టీమ్ ఫొటోలు, వీడియోలతో తనిఖీ నిర్వహించగా డ్రగ్ పట్టుబడింది.
ప్రాథమిక విచారణలో ఆమన్ అహ్మద్ మహ్మద్ ఆమిర్ (అలియాస్ ఆమిర్ ఖాన్) నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి ఇతరులకు అధిక ధరకు అమ్ముతూ లాభాలు పొందుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. నిందితుడిని ఆగస్టు 24న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన సరఫరాదారు ఆమిర్ ఖాన్ పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. మరో ఇద్దరు సంబంధితులు కూడా పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.పోలీసులు ఈ కేసులో సరఫరా నెట్‌వర్క్‌ను పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలని, మాదకద్రవ్యాల విక్రయాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.






