25 August, 2026 | 3:02 PM

వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి

25-08-2026 02:27 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): భావితరాలకు సమతుల్యమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత పిలుపునిచ్చారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవం–2026 కార్యక్రమంలో కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, జిల్లా అటవీ అధికారి బాలమణిలతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన, సహజమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. జిల్లాలో వన మహోత్సవం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ, అటవీ శాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.