పేరుకే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
సమయ పాలన పాటించని వైద్యులు, సిబ్బంది
ఏజెన్సీ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం
తల్లీ బిడ్డల మృతితో మరోసారి బయటపడ్డ పీహెచ్‌సీ డొల్లతనం
గుండాల, జూన్ 17 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతవాసులకు వైద్యం కరువైంది. గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేవలం అలంకార ప్రాయంగా ఉందన్న విమర్శలు వినవస్తున్నాయి. పీహెచ్‌సీకి వచ్చిన రోగులకు సరైన వైద్య సేవలందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒక్కోసారి రోగులకు సరైన చికిత్స అందక మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. శనివారం పీహెచ్‌సీకి ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి సరైన వైద్యం అందకపోవడంతో తల్లీబిడ్డ మృత్యువాత పడ్డారు. సమయానికి వైద్యాధికారి అందుబాటులో లేక, సరైన వైద్యం అందకపోవడం ప్రభుత్వ ఆసుపత్రి డొల్లతనం మరోసారి బయటపడింది.
ఆ సమయంలో పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎం ఆ మహిళకు కాన్పు చేయడంతో ఆడపిల్లకు జన్మ నిచ్చింది.శిశువు పుట్టగానే ఏడవకపోవడం, బాలింతకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రి వైద్య సిబ్బంది ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారని, అప్పటికే పాప మరణించిందని ఇల్లందు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
బాలింతకు రక్తస్రావం ఇంకా ఎక్కువ కావడంతో ఇల్లందు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఖమ్మం ఆసుపత్రికి పంపించగా బాలింత చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో ఆమె కూడా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తల్లీబిడ్డల మృతికి కారకులైన గుండాల పీహెచ్‌సీ వైద్య సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని బాలింత తల్లిదండ్రులైన కుంజా సత్యం, కుంజా లక్ష్మి జిల్లా వైద్యాధికారికి మంగళవారం ఫిర్యాదు చేశారు.
కాగా ఇప్పటికే పీహెచ్‌సీపై పలు పత్రికలు ఎన్నో కథనాలు ప్రచురించాయి. దీంతో యంత్రాంగం తూతూ మంత్రంగా విచారణ జరిపించి, వెళ్లిపోవడం ఆనవాయితీగా వస్తుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే వైద్య సిబ్బంది మాత్రం సమయపాలన పాటించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గుండాల పీహెచ్‌సీ ఘటనలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ అన్నారు. స్టాఫ్ నర్స్ సిబ్బంది కొరత వాస్తవం అన్నారు.






