చంపినోడే సంతాప సభ పెట్టినట్టు
ప్రొ.సంగని మల్లేశ్వర్ :
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాలు దాటినా ఆకాంక్షలు నెరవేరలేదు. కొత్తగా పురుడుపోసుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఒరిగిందేమి లేదు. కేసీఆర్ పాలనలో దశాబ్ద కాలం పాటు ప్రజల దరిచేరని అనేక అంశాలను పక్కనపెడితే, రాష్ట్రంలో ఉపాధి అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి. ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశపడ్డ తెలంగాణ బిడ్డలకు ఆశించిన రీతిలో ఉద్యోగాలు లభించలేదు.
లక్షల మంది నిరుద్యోగులైన పట్టభద్రులు సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి, వ్యయ ప్రయాసలకోర్చి తల్లిదండ్రులకు భారమయ్యే పరిస్థితి దాపురించింది. 2014లో కొలువైన కేసీఆర్ సర్కార్ 2,32,308 ఉద్యోగ ఖాళీలను గుర్తించి, రెండు పర్యాయాల పాలనలో 1,60,083 ఉద్యోగాలు మాత్రమే నింపింది. ఇందులో మొదటి దఫాలో 1,41,735 కొలువులను పక్కనపెడితే, రెండవ దఫా అధికారంలోకి వచ్చినాక 18,348 మాత్రమే నింపింది.
ఇంకా 42,652 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు వాయిదాలు, రద్దులు, ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతిన్నది. దేశంలోనే అత్యధిక నిరుద్యోగ రేటు తెలంగాణలో ఉందని, నిరుద్యోగుల డేటా కోసం కేసీఆర్ ప్రభుత్వం బిస్వాల్ కమి టీని నియమించింది. తెలంగాణలో మొత్తం 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది.
రెండవ దఫా బంపర్ మెజార్టీతో గెలిపించిన పాపానికి కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు శాపంగా మారి, పదవీ విరమణ వయస్సును 61కి పెంచి అన్యాయం చేసింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పదవీ విరమణకు సిద్ధంగా ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులను పట్టించుకోకుండా కక్షపూరితంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఎందుకంటే 2,125 పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని గణాంకాలు చెప్పినా, ప్రమాణాల పేరుతో యూనివర్సిటీల్లో సాఫీగా సాగుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో నిప్పులు పొసే విధంగా 2022లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు గవర్నర్ ఆమోదం పొంద క చిక్కుల్లో పడ్డది. ఇక జాబ్ మేళాలో ప్రకటించిన 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను ఓటుబ్యాంక్‌గా రెగ్యులరైజ్ చేసిం దనేది నిర్వివాదాంశం.
నేడు నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పు డు నింపుతారని ప్రశ్నించడంలో ధర్మం ఉంది. కానీ బీఆర్‌ఎస్ వేదికను ఎంచుకోవడం బాగాలేదనే విమర్శ ఉంది. యువ సంగ్రామ సభలో నిరుద్యోగుల గోడు వినిపించకుండా కేవలం కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న నిరుద్యోగ వక్తలకు, రాజకీయాలకు ఏమి సంబం ధం? సభ ప్రాంగణంలో నిరుద్యోగుల ఆక్రోశం చూస్తే కాళోజీ సామెత గుర్తొచ్చింది.
‘నిరుద్యోగులకు పెట్టిన టోపీ చూడు, యువ సంగ్రామంలో ఎగిరిన జెండా కాదు’ అన్నట్లు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం దేనికి? 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది అబద్ధమా? గత ప్రభుత్వ వైఫల్యాలపై సమాధానం చెప్పకుండా, ప్రస్తుత ప్రభుత్వంపై మాత్రమే విమర్శలు చేయడం రాజకీయంగా ప్రయోజనం కలిగించవచ్చు గానీ, నిరుద్యోగ యువతకు మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే ఈ పరిస్థితిని చూసినప్పుడు ‘చంపినోడే సంతాప సభ పెట్టినట్టు’ అనే సామెత గుర్తుకురాక మానదు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీని నిలదీయకుండా, రెండేళ్ల కాం గ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం ఎవరి ప్రయోజనాల కోసం? నిజంగానే బీఆర్‌ఎస్‌కు మరో ఛాన్స్ ఇస్తే వెలగపెట్టడం కాదు, దశాబ్దం పాటు ఏం వెలగ బెట్టారో చూస్తే మంచిది. దశాబ్దకాలంగా ఒక్క గ్రూప్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలు నింపలేదు. అందుకే నిరుద్యోగ యువత కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపి కాంగ్రెస్‌కు పట్టం కట్టింది.
రేవంత్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన విధంగా ఇంకా రెండు సంవత్సరాల కాలంలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే గురుతరమైన భాద్యత తీసుకోని చిత్తశుద్ధిని చాటాలి. భేషజాలకు పోకుండా నిన్నటి వేదిక పంచుకున్న నిరుద్యోగులు నాడు బీఆర్‌ఎస్ గద్దె దిగేందుకు కొట్లాడినవారే అన్న సంగతి కాంగ్రెస్ గుర్తెరగాలి.
వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ
విభాగాధిపతి, 9866255355






