పంచమవేదాన్ని పరిరక్షిద్దాం!
చలాది పూర్ణచంద్ర రావు :
ఆయుర్వేద వైద్యం సాంప్రదాయం భారతీయ సంస్కృతిలో కీలకమైనది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 80 శాతం మంది ఏదో ఒక రకమైన సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాన్ని ఉపయోగిస్తున్నారని అంచనా. భారతదేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుర్వేద వైద్య పాఠశాలలు, క్లినిక్‌లు, ఆసుపత్రులు ఉన్నాయి.
‘స్వస్థస్య స్వస్త్య రక్షణం, అతురస్య వికార ప్రశంసానం’ అనగా ఆరోగ్యవంతుల ఆరోగ్యాన్ని కాపాడటం, రోగుల వ్యాధిని నయం చేయడం ఆయుర్వేద ప్రాథమిక సూత్రం. ఆయుర్వేదం అనగా ఆయు+ వేద అనే రెండు పదాల కలయిక. ‘ఆయు’ అంటే జీవితం, ‘వేద’ అంటే శాస్త్రం. అందువల్ల ఆయుర్వేదం వ్యాధుల శాస్త్రం మాత్రమే కాదు, అది జీవిత శాస్త్రం కూడా.
ఆయుర్వేద శాస్త్రాన్ని వేదాల వలెనే మొద ట బ్రహ్మ స్వయంగా తెలుసుకున్నారని పురాణాలు తెలుపుతున్నాయి. తర్వాత బ్రహ్మ నుంచి దక్షప్రజాపతి, ఆయన నుంచి అశ్వినీ దేవతలు, వారి నుంచి ఇంద్రుడు ఆయుర్వేదాన్ని నేర్చుకున్నారన్నది ప్రతీతి. ధర్మార్థ కామ మోక్షాలకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలనే సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల పట్ల దయ కలి గి, త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడిని వేడుకున్నారు.
అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అనే 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదాన్ని ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించారు. ఆ ఋషులు పరమానందంతో భూలోకానికి వచ్చి శిష్యులకు ఉపదేశించగా, ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రం అనే గ్రంథాన్ని రచించి విశ్వవ్యాప్తి చేశారు. ఈ విధంగా అవతరణ జరిగిన ఈ ప్రాచీన దేశీయ ఆయుర్వేద వైద్యానికి మారుతున్న కాల పరిస్థితుల వల్ల కొంతవరకు అనారోగ్యం సోకింది.
ఆయుర్వేదం వైద్యం పేరుతో కొందరు అలోపతి వైద్యం చేయడమే అందుకు కారణం. ఇది గ్రహించిన మోదీ ప్రభుత్వం ఆయుర్వేదం, యోగా, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతిలను ఒకే తాటికిందకు తెచ్చి ‘ఆయుష్’గా మార్చి తగిన విధంగా ప్రోత్సహిస్తోంది. పైగా ఈ ఆయుష్‌కి ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.4,408.93 కోట్లను కేటాయించడంతో ఈ వైద్య విధానం తిరిగి ఆయుష్షు పోసుకుంటోంది.
వాస్తవానికి కొందరు వైద్యులు దీన్ని అభ్యసించి కూడా అలోపతి డాక్టర్ల వలెనే టెస్టులు చేస్తూ, ఔషధాలు ఇస్తున్నారు. ఆర్థికంగా ఎదగాలన్న దురాశతో పవిత్రమైన ఈ ఆయుర్వేద వైద్యవిధానాన్ని భ్రస్టుపట్టిస్తున్నారు. ఈ వైద్య విధానంలో ఎంఆర్‌ఐ లేదా సిటీ స్కాన్ వంటి ఆధునిక అలోపతిక్ నిర్ధారణ పరీక్షలను సిఫారసు చేయడానికి చట్టపరంగా అనుమతి లేదు. కోర్ట్ తీర్పుల ప్రకారం ఈ పరీక్షలను ఎంబీబీఎస్ లేదా సంబంధిత స్పెషలైజేషన్ చేసిన వైద్యులు మాత్రమే సిఫారసు చేయాలి.
అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్) వైద్యులు సాధారణంగా పూర్తిస్థాయిలో ఇంగ్లీష్ (అలోపతి) మందులు, సూది మందులు ఇవ్వడానికి కూడా నిబంధనల ప్రకారం అర్హులు కాదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో అత్యవసర సమయాల్లో పరిమిత మందుల వాడకంపై వెసులుబాట్లు ఉన్నప్పటికీ, జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం నిపుణులైన ఎంబీబీఎస్ లేదా ఎండీ, ఎంఎస్ డాక్టర్లు మాత్రమే అలోపతి మందులను సూచించాలి.
ఆయుర్వేద పరిధి విషయానికి వస్తే బీఏఎంఎస్ పూర్తిచేసిన వారు ఆయుర్వేద మం దులు, మూలికలు, పంచకర్మ చికిత్సలు మాత్రమే చేయాలి. అయితే మహారాష్ట్రతో పాటు ఒకటి రెండు రాష్ట్రాల్లో స్థానిక చట్టాల ద్వారా ప్రాథమిక అలోపతి వైద్యానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో, జాతీయ స్థాయిలో పూర్తిగా అనుమతి లేదు.
అయినప్పటికీ కొందరు ఆయుర్వేద వైద్యులు ఎంఆర్‌ఐ, సి.టి. స్కాన్ లాంటి ఖరీదైన టెస్టులు రాస్తూ, పేద రోగులను దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల ఇంగ్లీష్ మందులు, స్టెరాయిడ్‌లను నూరి ఆయుర్వేద మందులుగా ఇస్తున్నట్టు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్‌ల బారినపడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇలాంటి అక్ర మ వైద్యవిధానాల ద్వారా కొందరు ఆయుర్వేద ప్రాశస్తతని మంటకలుపుతున్నప్పటికీ, వైద్య ఆరోగ్య శాఖ గాని, డ్రగ్ కంట్రోల్ వ్యవస్థలు గాని పట్టించుకోవడం లేదు.
ఆయుర్వేదం 5,000 సంవత్సరాల క్రితం ప్రాచీన వేద కాలంలో పుట్టింది. ఆ తర్వాత చరక సంహిత, సుశ్రుత సంహితల ద్వారా అభివృద్ధి చెంది, నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆయుర్వేద నివారణల లో అత్యధిక భాగం (90%) మొక్కల ఆధారితమైనవి. ఆయుర్వేదంలో వేర్లు, ఆకులు, పండ్లు, బెరడు లేదా విత్తనాల నుంచి ఔషధాలు, మూలికలను తీసుకుంటారు.
19వ శతాబ్దంలో విలియం డైమాక్, సహ రచయితలు వందలాది మొక్కల నుంచి తీసుకున్న ఔషధాలు, వాటి ఉపయోగాలు, సూక్ష్మ నిర్మా ణం, రసాయన కూర్పు, విష శాస్త్రం, ప్రబలమైన అపోహలు, బ్రిటిష్ ఇండియాలో వాణి జ్య సంబంధాలతో పాటు సంగ్రహించారు. ఆమ్లకి, బిభితకి, హరితకి అనే మూడు పండ్ల మూలికా సూత్రీకరణ అయిన త్రిఫల అత్యంత సాధారణంగా ఉపయోగించే ఆయుర్వేద నివారణలలో ఒకటి.
విథానియా సోమ్నిఫెరా (అశ్వగంధ), ఓసిమమ్ టెనుఫ్లోరమ్ (తులసి) అనే మూలికలను కూడా ఆయుర్వేదంలో సాధారణంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఆయుర్వేద వైద్యానికి ఉపయోగపడే ఔషధ మొక్కల జాతులు 17,000 నుంచి 70,000 పైగా ఉన్నట్టు తెలుస్తున్నది. వీటిలో ప్రధాన శాస్త్రీయ సంస్థల అంచనాల ప్రకారం బ్రిటన్‌లో 1759లో నెలకొల్పిన రాయల్ బొటానికల్ గార్డెన్స్‌లో 17,810 రకాల ఔషద మొక్కలు ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న 21,000, విస్తృత ప్రపంచ అంచనాల ప్రకారం 50,000 నుంచి 70 వేలకు పైగా జాతులు ఉన్నాయి.
140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 80 శాతం మంది ఏదో ఒక రకమైన సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాన్ని ఉపయోగిస్తున్నారని అంచనా. భారతదేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుర్వేద వైద్య పాఠశాలలు, క్లినిక్‌లు, ఆసుపత్రులు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యం సాంప్రదాయం భారతీయ సంస్కృతిలో కీలకమైనది.
వేల సంవత్సరాలుగా దీనిని ఉపయోగిస్తున్న చరిత్రను ఉటంకిస్తూ, ఆయుర్వేద వైద్యం అంటే నమ్మకం ఉన్న వారు దాని ప్రభావశీలతను బలంగా విశ్వసిస్తారు. ఆ విశ్వసనీయత దెబ్బతినకుండా ప్రభుత్వం చూడాలి. ఆయుర్వేదం ముసుగులో అలోపతి వైద్యం చేస్తూ కాసులు దండుకుంటున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలి. తద్వారా ఐదవ వేదం, పదకొండవ అవతారంగా చెప్పుకొనే ధన్వంతరికి అపకీర్తి రాకుండా చూడాలి.
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, 9491545699






