పీవోకేలో దమనకాండ
పీవోకే చట్టసభలో 12 సీట్లను శరణార్థులకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమం క్రమంగా తీవ్రరూపం దాలుస్తున్నది. పాకిస్థాన్ ఆధిపత్యాన్ని నిరసిస్తూ ఇటీవల ప్రారంభమైన ఎన్నికలను బహిష్కరించి, ఆందోళనలు చేస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తల పై పాక్ సర్కార్ దమనకాండకు దిగింది. పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 20 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోవడం, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడటంతో పీవోకేలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ముహమ్మద్ అసిఫ్ చేసిన వ్యాఖ్యలు పీవోకే, పాక్ ప్రభుత్వం మధ్య అగాధాన్ని మరింతగా పెంచాయనే చెప్పాలి. పీవోకే నిరసనకారులను భారత్‌తో పోల్చిన ఆయన, వారితో చర్చలకు తావులేదని చెప్పడం పాక్ వైఖరిని స్పష్టం చేస్తున్నది. అయి తే, ఇప్పటివరకు పీవోకే తమ దేశంలో అంతర్భాగమని చెబుతూ వచ్చిన పాక్, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని భారతదేశంతో పోల్చడం రాజకీయంగా ప్రాధా న్యం సంతరించుకుంది.
ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో పీవోకే అంతర్భా గం కాదన్న భారతదేశ వాదనను పరోక్షంగా అంగీకరించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, గతంలోనూ జీవన వ్యయం పెరగడం, నిరుద్యోగం, ఉపాధి అవకాశాల కొరత వంటి సమస్యలపై పీవోకేలో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజా ఉద్యమం మాత్రం పూర్తిగా భిన్నమైన రూపాన్ని సంతరించుకోవడం గమనార్హం. ప్రస్తుత నిరసనలు పీవోకే ప్రజల అస్తిత్వం, ప్రాంతీయ హక్కులు, స్వయంపాలన, స్థానిక ప్రజల నిర్ణయాధికారం వంటి అంశాల చుట్టూ ప్రధానంగా తిరుగుతున్నాయి.
తమ భూభాగంపై బయటి శక్తుల ఆధిపత్యాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇది పాలనలో మార్పులు కోరే ఉద్యమం మాత్రమే కాదు, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలనే ఆకాంక్షకు ప్రతిరూపంగా మారుతున్న సంకేతా లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాభిప్రాయాలను విస్మరించి పాక్ తీసుకుంటున్న నిర్ణయాలు పీవోకేలో అసంతృప్తిని పెంచుతున్నాయి.
భద్రతా బలగాల కాల్పులు పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోగా, ప్రజల్లో ఆగ్రహానికి ఆజ్యం పోస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఉద్యమం కొన్ని వర్గాలకు, ముఖ్యంగా రాజకీయ పక్షాలకే పరిమితమైంది. కానీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు విస్తరించే అవకాశాలను కొట్టిపారేయలేం. అదే జరిగితే భవిష్యత్తులో పీవోకేలో పాక్ ఆధిపత్యానికి పూర్తిగా తెరపడుతుందని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.






