10 July, 2026 | 1:47 AM

మాటలతో బతికే ప్రభుత్వం కాదు

10-07-2026 12:33 AM
  1. రైతులకు చేసింది లెక్కలతో సహా చెప్పేందుకు సిద్ధం
  2. వారి ఆదాయం పెంచడమే ప్రభుత్వ ధ్యేయం
  3. సాగునీరు, ధాన్యం కొనుగోలు, మార్క్‌ఫెడ్ అంశాలపై ప్రత్యేక దృష్టి 
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
  5. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో మెగా రైతుమేళా ప్రారంభం
  6. హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మధిర/చింతకాని, జూలై 9 (విజయక్రాంతి): రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత ప్రతిపక్షాలకు లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతులకు ఏమి చేసిందో లెక్కలతో సహా సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  అన్నారు.

ప్రజా ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగునీరు, వ్యవసాయం, ధాన్యం కొనుగోలు, మార్క్‌ఫెడ్ కార్యకలాపాలు, వ్యవసాయ యాంత్రీకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. గురువారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మెగా రైతు మేళాను భట్టి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని ధాన్యం కోనుగోళ్ల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పా రు. రైతుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత ప్రతిపక్షాలకు లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతులకు ఏమి చేసిందో లెక్కలతో సహా సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజాప్రభుత్వానికి మాటలు చెప్పి బతికేటువంటి అవసరం లేదని అన్నారు.

బీఆర్‌ఎస్ కట్టింది కాళేశ్వరం ఒక్కటేనని, రాష్ట్ర సంపదంతా పోగేసి ఆ ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు కొత్తగా తీసుకొచ్చే ప్రాజెక్టులు ఇతర అంశాలను కూలంకషంగా వివరించేందుకే రైతు ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని వెల్లడించారు. రాష్ట్రంలో పామాయిల్ సాగును విరివిగా ప్రోత్సహించామని తెలిపారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కలెక్టర్ దివాకర్ టిఎస్, కమిషనర్ సునీల్ దత్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.