జేపీఎన్సీఈ విద్యార్థి అరుదైన ఘనత
కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ ప్రశంస
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్‌లోని జేపీఎన్సీఈకి చెందిన ఎన్సీసీ క్యాడెట్ కె యాదయ్య దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే అరుదైన విజయాన్ని సాధించడం పట్ల కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. బెంగళూరులోని భారత వైమానిక దళానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ నిర్వహించిన అత్యంత క్లిష్టమైన హెడ్ డౌన్ బెడ్ రెస్ట్ సిమ్యులేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన యాదయ్యను ఆయన అభినందించారు.
దేశవ్యాప్తంగా కేవలం నలుగురు అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో యాదయ్య ఎంపిక కావడం మహబూబ్ నగర్ జిల్లా, జేపీ ఎన్సీఈ కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. భారత వ్యోమగాములు శుభాంషు శుక్లా, ప్రదీప్ నాయర్ చేతుల మీదు గా ప్రశంసాపత్రం అందుకోవడం యాదయ్య ప్రతిభకు నిదర్శనమని అన్నారు. అలాగే రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించడం కళాశాలకు దక్కిన మరో గౌరవమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కృష్ణమూర్తి, ఈఈఈవిభాగాధిపతి వెంకటేష్, ఈసీఈ విభాగ అధ్యాపకులు జగదీష్, ఓఎస్టీ సాయి తేజ తదితరులు యాదయ్యను ఘనంగా సత్కరించి అభినందించారు.






