ఓర్వలేకే బురదజల్లే ప్రయత్నం
తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే: మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు
నాగర్‌కర్నూల్, జూలై 9 (విజయక్రాంతి): పెద్దముద్దునూరు మొక్కజొన్న కొనుగోళ్లలో తనపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లా కలెక్టర్, సహకార శాఖ అధికారులతో విచారణ జరిపించాలని, తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పెద్దముద్దునూరు పీఏసీఎస్ ద్వారా 473 మంది రైతుల నుంచి 26,836 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేశామని, ఒక్కో సంచికి రూ.10 మాత్రమే రవాణా చెల్లించామని తెలిపారు.
రూ.44 లక్షల అవినీతి జరిగిందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తిమ్మాజీపేట మండలం గొరిట పీఏసీఎస్లో రూ.1.60 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మిషన్ భగీరథ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లోనూ కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కోటయ్య, గోపాల్రెడ్డి, హబీబ్, రాములు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.






