కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే
వరంగల్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్
హనుమకొండ/జనగామ, మే 11 (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వందల కోట్లు పంచిపెట్టి వరంగల్‌లో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చే డబ్బులు తీసుకొని ఓటు మాత్రం బీజేపీకి వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాను గెలిచిన తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హామీలు అన్ని పేరుకేనని, ప్రజలకు చేసేందేమీ లేదని దుయ్యబట్టారు. బీజేపీ దేశంలో 12 కోట్ల మరుగుదొడ్లు, 4 కోట్ల ఇళ్లు నిర్మించిందని గుర్తుచేశారు. సమావేశంలో సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, మార్తినేని ధర్మారావు, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంటా రవి, రావు పద్మతో పాటు ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు..
దేశ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలో లేరని అరూరి రమేశ్ అన్నారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.






