గెలిస్తేనే నిలిచేది
- లక్నోతో పంజాబ్ చావోరేవో
- వరుస పరాజయాలతో డీలా
- శ్రేయాస్ కెప్టెన్సీకి పరీక్ష
లక్నో, మే 22 : ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ డూ ఆర్ డై మ్యాచ్‌కు సిద్ధమైంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయిం ట్స్‌తో తలపడబోతోంది. లక్నో హోంగ్రౌండ్ లో జరగబోతున్న ఈ మ్యాచ్ పంజాబ్‌కు కీలకం. ఎందుకంటే వరుసగా ఆరు మ్యాచ్ లు ఓడి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నిజానికి సీజన్ ఆరంభంలో పంజాబ్ ఆటతీరు చూసిన తర్వాత టైటిల్ ఫేవరెట్స్ లో ముందుంటుందని అంతా అనుకున్నా రు. దానికి తగట్టే వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచింది. సెకండాఫ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఇప్పుడు లక్నోపై గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. అదే సమయంలో రాజస్థాన్, కోల్‌కతా జట్లు తమ చివరి మ్యాచ్‌ల లో ఓడిపోవాల్సి ఉంటుంది.
పంజాబ్ బలమంతా బ్యాటింగే. గత మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యంతో భారీ టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ , కూపర్ కన్నోలీ రాణిస్తే తిరుగుండదు. చివర్లో స్టోయినిస్, శశాంక్ సింగ్ మెరు పులు మెరిపిస్తున్నారు. బౌలింగ్ పరంగా అర్షదీప్ సింగ్, బార్ట్ లెట్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అర్షదీప్ సింగ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఒమర్జాయ్, ఫెర్గ్యూసన్ లపై అంచనాలున్నాయి.
చాహల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశముంది. మరోవైపు లక్నో సూపర్ జెయిం ట్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. గత సీజన్ తరహాలోనే ఈ సారి కూ డా లక్నో నిరాశ పరిచింది. అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ విఫలమయ్యారు. కెప్టెన్ పంత్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. నికోలస్ పూరన్ వైఫల్యం కూడా లక్నో ఓటములకు కారణంగా చెప్పొ చ్చు. ఈ సీజన్‌ను చివరి స్థానంలో ముగించకుండా ఉండాలంటే పంజాబ్‌పై గెలవాలి. చెన్నైని ఓడించిన తర్వాత రాజస్థాన్ చేతిలో పరాజయం పాలైన లక్నోకు నిలకడలేమి బ్యాటింగ్ ఇబ్బందిగా మారింది. బౌలింగ్‌లో మోనిస్, మయాంక్ కీలకంగా ఉన్నారు.
తుది జట్లు అంచనా
లక్నో : మార్ష్, ఇంగ్లీస్, పూరన్, బదోనీ, పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మోసిన్ ఖాన్, మయాంక్ , ఆకాశ్ సింగ్, ప్రిన్స్ యాదవ్
పంజాబ్ : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాన్ష్ , ఒమర్జాయ్, హర్ ప్రీత్ బ్రార్, బార్ట్ లెట్, ఫెర్గ్యూసన్, అర్షదీప్






