కార్మికుల హక్కులను కాలరాసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే..
- కార్మిక సంఘాలను రద్దు చేసి కార్మికుల ఓట్లు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు
- బీఆర్‌ఎస్‌పై కవిత చేసే ఆరోపణలపై హరీష్ రావు జవాబు చెప్పాలి
- తెలంగాణ ద్రోహి తలసాని శ్రీనివాస్ యాదవ్
- జలమండలి ఉద్యోగ, కార్మికుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే పరిష్కారం
- ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, అభ్యర్థి మొగుళ్ళ రాజిరెడ్డి
ముషీరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలు లేకుండా చేసి కార్మికుల హక్కులను కాలరాసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, అభ్యర్థి మొగుళ్ళ రాజిరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కార్మికుల సంక్షేమంపై హరీష్ రావు నీతులు పలకడం సిగ్గుచేటన్నారు.
హైదరాబాద్ బాగ్ లింగంపల్లి విఎస్టి యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ జలమండలి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ ద్రోహి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని తమ ట్రేడ్ యూనియన్ అభ్యర్థి రాంబాబు యాదవ్ ను గెలిపించాలని కోరడం విడ్డురంగా ఉందన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా జలమండలి కార్మికులకు మోసం చేసి, ఇప్పుడు ఇది చేస్తాం, అది చేస్తామని పచ్చి అబద్ధాలు పలకడం దుర్మార్గమన్నారు. ఈ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ను భారీ మెజారిటీ తో గెలిపిస్తారని మొగుళ్ళ రాజిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ డి. చంద్రశేఖర్, అధ్యక్షులు విజయ్ కుమార్ యాదవ్, జలమండలి ఎస్సీ, ఎస్టీ యూనియన్ అధ్యక్షులు శంకర్ ప్రకాష్, విఎస్టి యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎల్.డి. పాల్ పాల్గొన్నారు.






