ఓబీసీలకు 50 శాతం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
- జూలై చివరి వారంలో ఢిల్లీలో భారీ సదస్సు
- మోదీ హయంలోనే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధ్యం
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): స్వాతంత్రం లభించి 78 సంవత్సరాలు గడిచిన బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలలో పాలకులు బీసీల వాటా లేదని, గత పార్టీలు పాలకులు బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు.
ఇప్పుడైనా మోడీ నాయకత్వంలో బీసీలకు న్యాయం చేయాలని, అందుకోసం బీసీలకు రాజకీయ వాటా ఇవ్వడం కోసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని జూలై చివరి వారంలో వేలాది మందితో భారీ బహిరంగ సభ జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఢిల్లీలో చేపట్టే సభకు కేంద్ర మంత్రులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారన్నారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర నుంచి బీసీ నాయకులు ప్రజలు పాల్గొంటారని తెలిపారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలిసి బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు అన్ని రంగాలకు కల్పించాలని కోరుతా మన్నారు. జనాభా ప్రకారం రాజకీయ రంగంలో, విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు పెంచాలని కోరుతామన్నారు.
ప్రధానమంత్రి ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా, విశ్వ గురువుగా గుర్తింపు పొందుతున్నారని పేర్కొన్నారు. అత్యంత రాజకీయ శక్తివంతుడు, ఇంత గొప్ప నాయకుడికి హయంలో బీసీలకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఇంకెవరు బీసీలకు న్యాయం చేయరన్నారు. బీజేపీ పార్టీ బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీనే ప్రధాన మంత్రిగా చేశారన్నారు. అంతే కాదు 27 మంది మంత్రులను, నలుగురు గవర్నర్లను చేశారని గుర్తు చేశారు. బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి మోడీ ద్వారానే జరుగుతుందన్నారు.






