17 July, 2026 | 4:12 AM

తెలంగాణకు ఇక కష్టమే!

06-06-2024 12:45 AM

కేంద్రంలో చక్రం తిప్పనున్న చంద్రబాబు

ఉమ్మడి సమస్యల్లో మాట నెగ్గించుకొనే అవకాశం

ఏపీకి వంతపాడక కేంద్రానికి తప్పని పరిస్థితి

నిధులు, ప్రాజెక్టుల్లో ఏపీకే ప్రాధాన్యం దక్కే సూచన

తెలంగాణలోని విపక్ష ప్రభుత్వంపై వివక్ష తప్పదు 

రియల్ ఎస్టేట్ రంగానికి తిరోగమనం తప్పదా?

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అటూ.. ఇటూ తిరిగి తెలంగాణకు ఇబ్బందికర పరిస్థితులను కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. పదేండ్లపాటు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో చాలాకాలం రాజకీయ వైరం పెట్టుకోవటంతో అనేక ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రంతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. పెండింగులో ఉన్న ఒకట్రెండు పనులు కూడా పరిష్కారమయ్యాయి. అయితే తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులో అడ్డంకులు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని తెలంగాణవాదులు కూడా అంచనా వేస్తున్నారు. 

అధికార ప్రతిపక్షాలు

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అధికార, ప్రతిపక్ష పాత్రలను తెరపైకి తీసుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మిత్రపక్షాలు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌కు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెరిసగం స్థానాలు దక్కాయి. బీఆర్‌ఎస్‌కు ఒక్కటీ దక్కలేదు.

ఇప్పుడు కేంద్రంలో ఏర్పడనున్న బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన పార్టీలు భాగస్వాములు అవుతున్నాయి. కనీసం మూడు నాలుగు కేంద్ర మంత్రి పదవులు, వీలైతే లోక్‌సభ స్పీకర్ పదవిని కూడా దక్కించుకొనేందుకు బేరసారాలు మొదలైనట్టు సమాచారం. కేంద్రంలో భాగస్వామ్యం ఉంటే నిధులు, ప్రాజెక్టులు.. లాంటి అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యం తప్పకుండా ఉంటుంది. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ప్రతిపక్ష పాత్ర లోనే నిధులు, ప్రాజెక్టుల కోసం కొట్లాడాలి. దీనివల్ల ఏయే అంశాలు ప్రభా వితం అవుతాయో ఒకసారి చూద్దాం..

* ఏపీలోని అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉంటుంది. దీనివల్ల రోడ్లు, పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక జోన్లు, రైల్వే, విమానాశ్రయాలు.. ఇలా అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ప్రాధాన్యం దక్కుతుంది. అదే సమయంలో తెలం గాణకు మొండి చెయ్యి చూపే ప్రమాదం ఉన్నది. 

* తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకు పోయింది. పార్టీ కార్యాలయం మాత్రమే మిగిలింది. ఆ పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరి పద వు లు అనుభవిస్తున్నారు. గతానుభవం దృష్ట్యా భవిష్యత్తులోనూ టీడీపీ ఇక్కడ కాలూనదు. రాజకీయంగా తమకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు తెలంగాణకు వచ్చే నిధులు, ప్రాజెక్టులకు మోకాలడ్డి ఏపీకి తరలించుకుపోరనే గ్యారెంటీ ఏమీ లేదు.

పైపెచ్చు ఏపీని అభివృద్ధి చేస్తేనే తనకు, తన పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండే ప్రస్తుత పరిస్థితుల్లో.. బాబు ఏపీ గురించే ఆలోచిస్తారు. తెలంగాణకు వచ్చే ఎలాంటి ప్రాజెక్టునైనా ఏపీకి తీసుకెళ్లే ఆలోచనే చేస్తారని చంద్రబాబు రాజకీయం గురించి తెలిసిన తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నేతలు అనుమానిస్తున్నారు.

* తెలంగాణ ఏర్పడటానికి ముఖ్యమైన అంశాలు నిధులు, నీళ్లు, నియామకాలు. ఇందులో నిధులు, నియామకాలను సొం తంగా తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంటుంది. నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంది. ఈ విషయంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించే చంద్రబాబు అభిప్రాయానికే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది.

దీంతో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన మాజీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. కృష్ణా నదీ జలాల వివాదం విషయంలో ఏపీ పట్టుబిగించే అవకాశం కనపడుతోంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదీ జలాలను మర్చిపోవాల్సిన అగత్యం ఏర్పడినా ఆశ్చర్యపోనక్కనరలేదని నిపుణులు పేర్కొంటున్నారు.

* దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో రోడ్ల పరిస్థితి బాగుంది. అదంతా మొన్నటివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల సాధ్యమయ్యిది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణకు అంతగా ప్రాధాన్యం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఏపీకి ప్రాధాన్యం పెరుగుతుందని అంటున్నారు.   

* అలాగే రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పుల విభజనపై ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యలు ఉండనే ఉన్నాయి. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల పరిష్కారంలో కేంద్రం ఏపీ ప్రభుత్వంవైపే మొగ్గు చూపిస్తుంది. కనుక ఇక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగే ఆస్కారం ఉంది.

* గడిచిన ఏడు నెలలుగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం స్థంభించిపోయింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇది మరింత బిగుసుకుపోయే ప్రమాదం ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమానిస్తున్నారు. ఏపీలో రియల్ ఎస్టేట్‌ను ప్రోత్సహించేలా, ఊతమిచ్చేలా కేంద్రం నుంచి టీడీపీ ప్రాజెక్టులను తెచ్చుకునే అవకాశం ఉంది. అదే జరిగితే హైదరాబాద్ కుదేలవుతుంది. ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలమంది రియల్టర్లు, లక్షల మంది వలస కూలీలు, పెట్టుబడిదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతారు.

* గడిచిన పదేండ్లుగా హైదరాబాద్ కేంద్రంగా అనూహ్యంగా అభివృద్ధి జరిగిం ది. ఇప్పుడు అదే వేగంతో హైదరాబాద్ ముందుకు సాగుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఏపీలో రాష్ట్ర రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం అక్కడి ప్రభుత్వంపై ఉంది. దీంతో కేంద్రంలో చక్రం తిప్పి హైదరాబాద్‌కు రావాల్సిన ప్రాజెక్టులను కూడా అక్కడికి తరలించుకుపోయే అవకాశం ఉన్నదని తెలంగాణవాదులు అంటున్నారు.

* తెలంగాణలో అనేక భారీ పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు వచ్చాయి. ఇలాంటివి ఇకపై వస్తాయా? ఇప్పటికే వచ్చిన సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరింపజేస్తాయా? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి అవకాశాలన్నీ ఏపీకి తరలించుకుపోయేందుకు అక్కడి ప్రభు త్వం సదా సిద్ధంగా ఉంటుందని, అవసరం అయితే కేంద్రం చేయూత కూడా ఇస్తుందనే అభిప్రాయం వినపడుతోంది.

* వీటన్నింటితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు తనకు గురువు అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బాహాటంగానే చెప్తుంటారు. ఈ నేపథ్యంలో తన గురువు పరిపాలించే ఏపీకి లాభం కలిగేలా తెలంగాణ సీఎం రేవంత్ వ్యవహరిస్తారనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు తెలంగాణ ప్రయోజనాల కంటే.. పక్క రాష్ట్రం అజమాయిషీకే తలవొగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

* రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కల్పించే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల్లోనూ.. ఏపీ ప్రభుత్వానికే పెద్దపీట ఉంటుందనేని అందరూ అంగీకరించేదే. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అందుకే పట్టుబడతారు. ప్రతిపక్షంలో ఉండే రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలుగుతారా అనేది సందేహాత్మ కంగా మారింది.

* గతంలో చాలా సందర్భాల్లో కేంద్రం మనకు మొండిచెయ్యి చూపిందని బీఆర్‌ఎస్ ప్రభుత్వం దుమ్మెత్తి పోసేది. భవిష్యత్తులో రేవంత్ సర్కారు కూడా ఇదేవిధంగా కేంద్రాన్ని దుమ్మెత్తిపోసే అవకాశాలున్నాయని తెలంగాణ వాదు లు పేర్కొంటున్నారు.