16-10-2025 02:10:17 AM
సాలెగూళ్లపై ‘మంచు ముత్యాల సవ్వడి’
వలిగొండ, అక్టోబర్ 15 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ పట్టణ కేంద్రాన్ని బుధవారం ఉదయం మంచుదుప్పటి కమ్మేస్తూ చక్కిలిగింతలు పెట్టింది. చెట్లు, రోడ్లు, ఊర్లను చల్లచల్లగా తడుముతూ.. దోబూచులాడింది. సాలెగూళ్లపై పొగ మంచు బిందువులు కురియగా అవి మంచు ముత్యాల దండల వలె సవ్వడి చేస్తూ మెరుస్తూ.. చూపరులను కనువిందు చేశాయి. అదేవిధంగా వలిగొండ మండలంలోని వివిధ గ్రామాలను కూడా దట్టమైన మంచు అలముకుంది.
వలిగొండ మండల కేంద్రంలో దట్టమైన పొగ మంచు కురియడంతో వాహనదారులు ఉదయం 7 గంటల వరకు కూడా తమ వాహనాలకు లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణాలు సాగించారు. పొగ మం చు కారణంగా గ్రామాల నుంచి పాలు, కూరగాయలు, ఆకుకూరలను తీసుకొచ్చేవారు కొంత ఇబ్బందిపడ్డారు.