calender_icon.png 2 November, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలేశుని ఉత్సవాలకు వేళాయె..

02-11-2025 12:07:31 AM

4నుంచి తిరుమల‘గిరి’ ఏడుకొండల స్వామి బ్రహ్మోత్సవాలు 

అక్కడి పచ్చని అడవులు.. ఎత్తున కొండలు.. ప్రకృతి అందాలు.. తిరుమల తిరుపతిని తలపిస్తాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని కొండల్లో స్వయంభువుగా వెలసిన శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు వేళయింది. ప్రతి యేటా నవంబర్ మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుతాయి. ఈ నెల 4 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు.  

శ్రీబుగులోని వేంకటేశ్వర స్వామి పలు ప్రత్యేకతలతో భక్తుల ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే వెంకన్నగా ప్రసిద్ధి. రోగాలను నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తుల గుబులు (భయం) పోగొట్టి, ధైర్యాన్ని ఇచ్చే స్వామిగా ఇలవేల్పు అయ్యారు. స్వామివారు సతీసమేతంగా కొండపై ఉన్న గుహల్లో కొలువై ఉంటారు. ఈ కొండల్లో శైవం,వైష్ణవం కలగలిపి ఉంటాయి. భక్తులు మొదట కొండ కింద గుహలో ఉన్న శివాలయంలో పూజలు చేసిన తర్వాతే కొండపై వెంకన్న దర్శనానికి వెళ్తారు.

గండ దీపం వెలిగిస్తే గండాలు పోతాయని..

బుగులోని జాతర ప్రధాన ఘట్టాల్లో కొండపై ఉన్న గండ దీపం ఒకటి. రాత్రి వేళ ఈ గండ దీపం మూడు కిలోమీటర్ల మేర దర్శనమిస్తుంది. ఈ దీపపు జ్వాల ఈ బ్రహ్మోత్సవాల అన్ని రోజులు అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. భక్తులు ఈ గండ దీపం చేరాలంటే  దట్టమైన అడవి, కొండల నడుమ ప్రయాణించాల్సి ఉంటుంది.  అందాల రాతి గుహలు దాటి గండ దీపం కొండపైకి ఎక్కగానే ఆకాశాన్ని తాకామా అనేలా ఉంటుంది. పైన ఉన్న గండ దీపంలో నూనె పోసి దీపం వెలిగిస్తే  కోరిన కోరికలు తీరి తమకు ఎదురయ్యే గండాలు పూర్తిగా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. 

ప్రభ బండ్ల సందడి 

జాతరకు ప్రభ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొక్కులు మొక్కిన భక్తులు తిరుమలగిరి గ్రామం నుంచి గడ్డితో తయారుచేసిన ఏనుగు బండ్లు (ప్రభ బండ్లు), గుర్రపు వాహనాలు, ఏడెంత్రాల ఎడ్ల బండ్లను తీసుకొని డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు, డీజే సౌండ్లు, కోలాటాల నడుమ ఊరేగింపుగా జాతరకు బయలుదేరుతారు. జాతరలో ఈ వాహనాలు ప్రతేక ఆకర్షణగా నిలుస్తాయి.

ప్రాంగణంలోకి రాగానే తమ వాహనాలతో స్తంభం చెట్టు(ఇప్ప చెట్టు) చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తారు. అయితే ఆ స్తంభం చెట్టు చుట్టూ భక్తులు ప్రభ బండ్ల తో పోటీ పడి తిరుగుతుంటారు. బాణసంచాలు పేలుస్తూ డప్పు, చప్పు ళ్లతో నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు.  అనంతరం  మొక్కుల ప్రకారం స్వామివారికి మేక ,గొర్రె పోతులను,కోళ్లను బలిస్తారు.

స్తంభం చెట్టు ప్రత్యేకత

ఈ స్తంభం చెట్టు (ఇప్ప చెట్టు) జాతరలో ఎంతో ప్రత్యేకమైనది. భక్తులు జాతరకు ఎలా వచ్చినా ముందుగా ఈ స్తంభం చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి ఆ చెట్టుకు గుమ్మ డికాయలను దానంగా ఇస్తారు. అయితే ఈ స్తం భం చెట్టుపై ఉన్న తొర్రల్లో నాగుపాము ఉంటుందని ప్రతి కార్తీక పౌర్ణమికి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు దర్శనం ఇస్తుందని స్థానికులు చెబుతారు.  

ఆలయ చరిత్ర ఇదీ..

పూర్వం తిరుమలగిరి శివారులోని ముక్కుడి గుడి గడ్డ వద్ద వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఉండేది. అయితే, లంబాడీ జాతికి చెందిన గుగులోత్ అనే వ్యక్తి స్వామివారికి సేవలు చేస్తూ, తన జీవనోపాధిగా మేకలు కాస్తూ జీవించేవాడు. పూర్వ కాలంలో గ్రామాల్లో దంపుడు బియ్యం రోకళ్లతో రాత్రిళ్లు దంచేవారు. ఈ రోకలి సప్పుల్లకు నిద్రకు భంగం వాటిల్లిందని భావించిన స్వామివారు, సతీసమేతంగా కొద్ది దూరంలో ఉన్న కొండలపైకి స్వయంభువుగా వెళ్లారని ప్రతీతి.

ఈ క్రమంలో మేకలను మేపడానికి వెళ్లిన గుగులోథ్‌కు కొండలపై పెద్ద శబ్దం వినిపించి మేకలన్నీ మాయమవుతాయి. అప్పుడు గుగులోథ్ భయంతో వేంకటేశ్వర స్వామి వారిని వేడుకోగా మేకలన్నీ ప్రత్యక్షమవుతాయి. అప్పుడు వేంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై ఈ కొండల్లో స్వయంభుగా వెలిసినట్టు చెబుతారని నానుడి. గుగు లొథ్ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చారని ఆ విధంగా ఈ ప్రదేశం అప్పటినుంచి భక్తుల గుబులు పోగొట్టే బుగులు వెంకన్నగా ప్రసిద్ధి.        రేగొండ, (విజయక్రాంతి)