02-11-2025 12:02:22 AM
ఆధ్యాత్మికంగా, భక్తుల కొంగుబంగారమై విలసిల్లుతున్న వైద్యనాథ లింగేశ్వర ఆలయం
‘సర్వరోగాల లయకారై.. భక్తుల కొంగుబంగారమై.. విలసిల్లుతున్నాడు వైద్య నాథ లింగేశ్వరుడు. భక్తజన దివ్యధామమై నిత్యపూజలందుకుంటున్నాడు. ఆలయం 108 శివలింగాలతో 108 మారేడు మొక్కలతో ప్రకృతిరమణీయంగా.. ఆధ్యాత్మిక క్షేత్రంగా అలరా రుతోంది. నిత్యకైంకర్యాలు, అభిషేకాలతో పరమ శివుడి కైలాసాన్ని తలపిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని కొండాయిగూడెం, రామానుజవరం గ్రామాల సరిహద్దులో, పవిత్ర గోదావరి తీరాన వెలసిన శ్రీ వైద్యనాథ లింగేశ్వర స్వామి క్షేత్ర విశేషాలపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..’
వైద్యుడిని నారాయణుడితో పోలుస్తూ కీర్తిస్తాం. కానీ కొండాయిగూడెం, రామానుజవరం గ్రామాల సరిహద్దులో భూత నాథుడైన శివుడు వైద్యనాథుడై భవ రోగాలను వదిలిస్తున్నాడు. అపార ధన్వంతరీ అవతారమే లయకారు స్వరూపంగా నిత్యపూజలు అందుకుంటున్నాడు. స్వామిని దర్శించుకొనే భక్తుల రద్దీతో ఈ ఆలయం చికిత్సాలయాన్ని తలపిస్తుంది. ఈ మహా శైవక్షేత్రంలో నవగ్రహాలను సతీ సమేతంగా ప్రతిష్టించారు. 35 అడుగుల అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా దర్శ నమిస్తాడు. ఆలయం చుట్టూ 108 చొప్పున శివలింగాలు ప్రతిష్ఠించి, మారేడు మొక్కలు నాటారు.
రోగ నివారణ క్షేత్రంగా..
ఆలయం రోగ నివారణ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఎన్ని దవాఖానలు తిరిగినా నయం కాని మొండి రోగాలు కూడా స్వామి కరుణతో తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. ఆలయాలను దర్శించుకునేందుకు సరిహద్దు రాష్ట్రాల భక్తులు తరలివస్తారు.
పూజలు.. ఉత్సవాలు
ప్రతి శివరాత్రికి స్వామివారి బ్రహ్మోత్సవాలు (జాతర) నిర్వహించడం ఆనవాయితీ. జాతరకు మణుగూరు, పినపాక మండలాల ప్రజలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంగపేట, రాజుపేట, ఏటూరు నాగారం ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఏటా మహా శివరాత్రి రోజున సుమారు 35వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు. సుబ్రహ్మణ్య షష్టి రోజున వల్లీదేవసేన సమేతంగా స్వామి వారి కల్యా ణం జరుపుతారు.
మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహి స్తున్నా రు. ‘తారక మంత్రం కోరిన దొరికెను, ధన్యుడనైతిని తారకేశ్వరా’ అని భక్తులు మనస్సుతో కొలిస్తే వారి బాధలు తీర్చి, మృత్యుంజయీభవ! అ ని దీవించే ఈ వైద్యనాథ లింగేశ్వరుని దర్శనం శుభకరం. ఫలప్రదం.
సుధీర్, మణుగూరు, విజయక్రాంతి
స్వామివారి అనుగ్రహంతో పరిపూర్ణ ఆరోగ్యం..
స్వామి అనుగ్రహంతో పరిపూర్ణ ఆరోగ్య వంతులైన వారు ఎంతో మంది ఉన్నారు. క్షేత్ర దర్శనంతోనే బాధలు తీరుతాయి. భక్తితో ఆయనను స్మరిస్తే కోరికలు తీరుస్తాడు.
డాక్టర్ పవన్‌శర్మ, ప్రధాన అర్చకుడు