calender_icon.png 21 November, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఐ కోర్టుకు జగన్

21-11-2025 12:06:42 AM

  1. అక్రమాస్తుల కేసులో ఆరేళ్ల తర్వాత విచారణకు హాజరు
  2. బేగంపేట విమానాశ్రయం వద్ద వైసీపీ శ్రేణులు హడావుడి

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 20 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ప్రకంపనలు సృష్టిస్తున్న అక్రమాస్తుల కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమా రు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగత విచారణ నిమిత్తం హాజరయ్యారు.

మ రోవైపు వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, మరో ముగ్గురు నాయకులను కోర్టు లోపలికి పో లీసులు అనుమతించలేదు. దీంతో వారు గేట్ వద్దే నిలుచున్నారు. న్యాయమూర్తి ఎదుట విచారణ అనంతరం జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లిపోయారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న జగన్, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ఆ తర్వాత కూడా తనకు కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పలుమార్లు పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే, ఈ అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావడం లేదు. ప్రస్తుతం ఈ కేసుల్లో అత్యంత కీలకమైన డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోంది. ఈ దశలో ప్రధాన నిందితుడు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావడం తప్పనిసరి అని సీబీఐ వాదించింది.

ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయ స్థానం, గురువారం లోపు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, జగన్‌కు వ్యక్తిగత హాజరు తప్పలేదు. ఆయన గురువారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి భారీ భద్రత నడుమ నేరుగా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

వివేకా కూతుర్ని పలుకరించని జగన్

నాంపల్లి కోర్టులో మాజీ మంత్రి, బాబాయి వివేకానందరెడ్డి కుమార్తె సునీత   జగన్‌కు తారసపడినా పలుకరించలేదు. వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించే పిటిషన్‌పై వాదనల నేపథ్యంలో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు సునీత గురువారం వచ్చారు. అదే సమయంలో అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ కూడా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కోర్టులో సునీతను చూసినా ఆయన పలుకరించకుండా వెళ్లిపోయారు. 

వైసీపీ నేతల అత్యుత్సాహం

జగన్ హైదరాబాద్ వస్తున్నారని తెలియడంతో, ఆయనకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా బేగంపేట విమానాశ్రయానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే  ‘సీఎం.. సీఎం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు.  కొందరు కార్యకర్తలు ఉద్వేగంతో భద్రతా వలయాన్ని, బారికేడ్లను ఛేదించుకుని ఆయన కా న్వాయ్ వద్దకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించారు.

అప్రమత్తమైన పోలీసులు వారిని బలవంతంగా అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు  లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడి వాతావరణం మరింత వేడెక్కింది. ఉన్నతాధికారులు కలుగజేసుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అనంతరం, జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు బయలుదేరింది.