పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా జగన్నాథ్
ఘట్ కేసర్, జూలై 27 (విజయక్రాంతి): పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్( Pocharam IT Corridor Police Station) నూతన ఇన్‌స్పెక్టర్ గా బి. జగన్నాథ్ బాధ్యతలు స్వీకరించారు. బదిలీల్లో భాగంగా ఇక్కడ పని చేస్తున్న సీఐ కనకయ్య గౌడ్ స్థానంలో జగన్నాథ్ నియమితులయ్యారు. సైబరాబాద్ లోని రామచంద్రపురం, మల్కాజిగిరి పిఎస్ లో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ గా జగన్నాథ్ పనిచేశారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఐ జగన్నాథ్ మాట్లాడుతూ ఐటీ కారిడార్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో, కాలనీల్లో నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే ఐటీ నిపుణులు, మహిళా ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన సీఐ జగన్నాథ్‌కు పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించవచ్చని, పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీఐ కోరారు.






