27 July, 2026 | 11:06 AM

రోడ్డు లేని ఆదివాసి బతుకు.. మార్గమధ్యలోనే గర్భిణీ ప్రసవం

27-07-2026 10:34 AM

చింతకుంటలో దయనీయ పరిస్థితి.. పాలకుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం

బూర్గంపాడు,జూలై 27(విజయక్రాంతి): రోడ్డు సౌకర్యం లేక ఆదివాసీల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) బూర్గంపాడు మండలం చింతకుంట గ్రామంలో సోమవారం జరిగిన ఘటన మరోసారి కళ్లకు కట్టింది. గ్రామానికి చెందిన సోడి మార్త (30)కు సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు(Ambulance) సమాచారం అందించారు. అయితే గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో అంబులెన్స్ ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారింది.

అడవిలోనే అంబులెన్స్‌లో ప్రసవం

అంబులెన్స్ పైలట్ విజయభాస్కర్ కష్టపడి గ్రామానికి చేరుకుని గర్భిణీని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, అధ్వాన్నమైన రహదారి కారణంగా వాహనం తీవ్రంగా కుదుపులకు గురైంది. దీంతో గర్భిణీకి నొప్పులు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. పరిస్థితి విషమించడంతో సమీపంలోని అడవి ప్రాంతంలోనే అంబులెన్స్‌ను నిలిపివేసి, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) రాధ అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. మార్త పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, శిశువును భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

ఓట్ల సమయంలోనే గుర్తొచ్చే గ్రామమా?

ఈ ఘటనతో చింతకుంట గ్రామ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత గ్రామ సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని గ్రామస్థులు మండిపడ్డారు. కనీస రహదారి సౌకర్యం లేక గర్భిణీలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు, పాలకులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

108 సిబ్బందికి ప్రశంసలు

ప్రాణాపాయ పరిస్థితిలో సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి, శిశువు ప్రాణాలను కాపాడిన 108 అంబులెన్స్ ఈఎంటీ రాధ, పైలట్ విజయభాస్కర్‌లను గ్రామస్థులు అభినందించారు.

రోడ్డు వెంటనే నిర్మించాలి

ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చింతకుంట గ్రామానికి అన్ని కాలాల్లో రాకపోకలకు అనువైన రహదారిని తక్షణమే నిర్మించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. "రోడ్డు లేకపోవడం వల్ల ప్రతి అత్యవసర పరిస్థితి ప్రాణాలతో చెలగాటంగా మారుతోంది" అని వారు ఆందోళన వ్యక్తం చేశారు.