నేను సంగారెడ్డి నుంచి పోటీ చేయను
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి, జూన్ 16 (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఫైర్‌బ్రాండ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల చేసిన సంచలన ప్రకటన కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించి సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ సమక్షంలోనే సంగారెడ్డిలో పోటీ చేయనని జగ్గారెడ్డి ప్రకటన చేశారు.
కాగా ‘సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడించి పెద్ద తప్పు చేశారు.. నా జీవితంలో ఇకపై ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయను’ అంటూ ఆయన ప్రకటించడం వెనుక కేవలం ఓటమి ఆవేదనే ఉందా? లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందా? అనే కోణంలో రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి.
అయితే ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు పూర్తిగా దూరం కావడం లేదని, తన రూట్ మార్చుకుంటున్నారని క్షేత్రస్థాయి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాను పోటీ చేయనని ప్రకటించిన జగ్గారెడ్డి.. తన స్థానంలో తన భార్య, ప్రస్తుత తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు.సంగారెడ్డి వదిలేసినంత మాత్రాన జగ్గారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టమవుతోంది.






