సంగారెడ్డిలో 210 మంది చిన్నారులకు సైకిళ్ళు అందజేసిన జగ్గారెడ్డి
సంగారెడ్డి: టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు విడతలవారీగా సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 400 మంది చిన్నారులకు సైకిళ్ళు పంపిణీ చేసిన జగ్గారెడ్డి శనివారం మరో 210 మంది చిన్నారులకు సైకిళ్ళు పంపిణీ చేశారు. చిన్నారుల్లో ఉత్సాహం, ఆరోగ్యం, చదువు పట్ల ఆసక్తి పెంచడమే లక్ష్యంగా జగ్గారెడ్డి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. స్థానిక పిఎస్సార్ గార్డెన్ లో ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది.
ప్రతీ ఒక్క చిన్నారికి జగ్గారెడ్డి స్వయంగా సైకిల్ అందజేశారు. ఐదు సంవత్సరాలు మొదలుకుని 15 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు సైకిళ్ళు అందజేశారు. చిన్నారులకు, బాలురకు, బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్ళు అందజేశారు. గత వారం టోకెన్ లు ఇచ్చిన వారికి శనివారం సైకిళ్ళు పంపిణీ చేశారు. టోకెన్ లు లేని చిన్నారుల కు మరోసారి సైకిల్ లు పంపిణీ చేసేందుకు వీలుగా అందరి చిన్నారుల ఆధార్ కార్డు, పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ తో కూడిన వివరాలు తీసుకోవాలని జగ్గారెడ్డి నిర్వాహకులకు సూచించారు. సైకిళ్ళు రాని చిన్నారులు ఎవరు ఆందోళన పడవద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ సైకిళ్ళు పంపిణీ చేస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.






