30 August, 2026 | 4:18 AM

కాంగ్రెస్ నేతలపై జగ్గారెడ్డి ఫైర్!

30-08-2026 12:31 AM
  1. హాజరుకాని వారిని తొలగించండి
  2. రాజకీయమంటే తపన ఉన్న వారికే అవకాశం 
  3. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఆగస్టు 29 (విజయక్రాంతి): సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సమావేశానికి హాజరుకాని వారిని కమిటీ నుంచి తీసివేసి వేరే వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. శనివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాల పార్టీ కమిటీలు ప్రకటిస్తున్న సమయంలో లిస్టులో పేరున్న నాయకులు గైర్హాజరు కావడంతో జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమిటీలో ఉన్నవారు కూడా  సమావేశానికి హాజరుకాక పోవడం ఏమిటని ప్రశ్నించారు. వారిస్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించారు.

రెండు రోజుల్లో తన కుమారుడి నిశ్చితార్థం ఉన్నా తాను 11 గంటలకే సమావేశానికి వచ్చానని తెలిపారు. తనకు  ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంది కాబట్టి ఇలా ఉన్నానని తెలిపారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారిని మాత్రమే మండల కమిటీల్లోకి తీసుకోవాలన్నారు. ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేసేవారిని తీసుకోవద్దన్నారు.

సంగారెడ్డిలో ఇక కాంగ్రెస్‌కి తప్ప మరోపార్టీకి అవకాశం ఉండదని, రానున్న పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే గెలుస్తారని జోస్యం చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నా భార్య నిర్మల, తర్వాత ఎన్నికలో ఆంజనేయులు పోటీలో ఉంటారన్నారు. నేను పోటీలో ఉంటే గెలుపు కోసం నేను కసిగా పని చేయను. కానీ మా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేను కసిగా పని చేస్తానన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎన్ని వ్యూహాలు చేసినా రాజకీయంగా తిప్పికొడుతానన్నారు.

ఎవరెన్ని డైలాగులు కొట్టినా ప్రత్యర్థి సర్వం ఒడ్డినా నేను గీసిన డిజైన్ ముందు అపొజిషన్ వ్యూహాలు పనికిరావని ధీమా వ్యక్తం చేశారు. డబ్బులుంటేనే రాజకీయాల్లో గెలుస్తామని అనుకోవడం భ్రమనే అవుతుందని జగ్గారెడ్డి అన్నారు.